గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని.. ఆశావాహుల కోలాహలం

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పురపాలక సంఘాల్లో కోఆప్షన్ పదవుల లొల్లి షురూ కాబోతున్నది. కౌన్సిలర్ హోదాతో సమానమైన ఈ పదవులు దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కో ఆప్షన్ పదవుల ఎన్నికలకు రాష్ట్ర పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు బడా నేతల చుట్టూ తిరుగుతున్నారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురపాలక సంఘాల్లో కో ఆప్షన్ ఎన్నికల కోలాహలం […]

Update: 2020-07-11 21:09 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పురపాలక సంఘాల్లో కోఆప్షన్ పదవుల లొల్లి షురూ కాబోతున్నది. కౌన్సిలర్ హోదాతో సమానమైన ఈ పదవులు దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కో ఆప్షన్ పదవుల ఎన్నికలకు రాష్ట్ర పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు బడా నేతల చుట్టూ తిరుగుతున్నారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురపాలక సంఘాల్లో కో ఆప్షన్ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటి నుంచే పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఈ పదవులు క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలకు ఎక్కువగా దక్కనున్నాయి. భాషాపరమైన విషయాలు కౌన్సిల్‌లో సమస్యను తీర్చేందుకు గాను ఈ కో ఆప్షన్ పదవులను అమలు చేస్తున్నారు. అధికారులు, సభ్యులకు మధ్య భాష అర్థం కాకపోతే కో ఆప్షన్ సభ్యులు కలగజేసుకుని పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటారు. కానీ రాను రాను ఈ పదవులు పూర్తిగా రాజకీయమయం అయ్యాయి. దీంతో అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకు ఈ పదవులు దక్కుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 14 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏడు పాత మున్సిపాలిటీలు కాగా, తాజాగా ఏడు కొత్త మున్సిపాలిటీలు పెరిగాయి. ఆదిలాబాద్, నిర్మల్, బైంసా, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్ నగర్ పాత మున్సిపాలిటీలు కాగా.. కొత్తగా లక్షెట్టిపేట, ఖానాపూర్, నస్పూర్, చెన్నూర్, క్యాతన్ పల్లి, ఆసిఫాబాద్, ఉట్నూరు మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఇప్పుడు ఈ మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల సంఖ్యను బట్టి ఇద్దరి నుంచి ఐదుగురు దాకా సభ్యుల ఎంపిక జరగనుంది.

ఈ మున్సిపాలిటీల్లో బ్రేక్?

కో ఆప్షన్ ఎన్నికలకు పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలక వర్గాలు ఉన్నాయి. దీంతో అన్ని చోట్ల కో ఆప్షన్ సభ్యులు ఆ పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఇదే అధికార పార్టీకి తలనొప్పిగా తయారవుతున్నది. అయితే మందమర్రి, ఆసిఫాబాద్, ఉట్నూర్ మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఈ మున్సిపాలిటీల్లో ఏజెన్సీ సమస్య కారణంగా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. దీంతో కోఆప్షన్ ఎన్నికలు కూడా జరిగే వీలు లేదు.

మంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహులు

కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ పదవులు పొందేందుకు టీఆర్ఎస్ నేతలు పైరవీలు మొదలుపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేల సహకారంతో పదవులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు చెప్పిన వారే కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలతో పాటు రాజకీయ అనుభవం ఉన్నవారిని కూడా ఈ పదవుల్లోకి తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి వారుగా పైరవీలు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News