మంత్రి ఎంట్రీతో సీన్ రివర్స్.. నిరాశలో టీఆర్ఎస్ నేతలు

దిశ, భద్రాచలం: చర్ల మండలంలో పార్టీ పదవుల పంపిణీలో నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఇరకాటంలో పడినట్లుగా తెలుస్తోంది. చర్లలో ఉప్పు, నిప్పులా ఉంటున్న నాయకులను, వారి గ్రూపులను సమన్వయం చేస్తూ కమిటీలు వేయడం ఆయనకు తలనొప్పిగా తయారైంది. కరవమంటె కప్పకు, వదలమంటె పాముకి కోపం అన్నట్లుగా రెండు గ్రూపుల ఆధిపత్య పోరుతో అడకత్తెరలో పోకచెక్కలా వెంకట్రావు నలిగిపోతున్నారు.‌ పార్టీ కమిటీల అధికారిక ప్రకటన జాప్యం అవుతున్న కొద్దీ గ్రూపు లీడర్ల […]

Update: 2021-10-06 21:42 GMT

దిశ, భద్రాచలం: చర్ల మండలంలో పార్టీ పదవుల పంపిణీలో నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఇరకాటంలో పడినట్లుగా తెలుస్తోంది. చర్లలో ఉప్పు, నిప్పులా ఉంటున్న నాయకులను, వారి గ్రూపులను సమన్వయం చేస్తూ కమిటీలు వేయడం ఆయనకు తలనొప్పిగా తయారైంది. కరవమంటె కప్పకు, వదలమంటె పాముకి కోపం అన్నట్లుగా రెండు గ్రూపుల ఆధిపత్య పోరుతో అడకత్తెరలో పోకచెక్కలా వెంకట్రావు నలిగిపోతున్నారు.‌ పార్టీ కమిటీల అధికారిక ప్రకటన జాప్యం అవుతున్న కొద్దీ గ్రూపు లీడర్ల నుంచి సరికొత్త డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. పార్టీ అనుబంధ కమిటీలను చీటికిమాటికి మార్పులుచేర్పులు చేయడం ఇబ్బందికరంగా తయారై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి జోక్యంతో మారనున్న పదవులు
భద్రాచలం ప్రాంతానికి చెందిన ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెల్లం వెంకట్రావులు కలిసి ఖరారు చేసిన చర్ల మండల పార్టీ అనుబంధ కమిటీల విషయంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జోక్యం చేసుకోవడంతో మరోమారు జాబితా మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఇపుడు ఓసీ (కమ్మ) సామాజిక వర్గానికి ఖరారు చేసిన చర్ల టౌన్ అధ్యక్ష పదవిని ఓట్లు అధికంగా ఉన్న బీసీ (పద్మశాలి) సామాజిక వర్గానికి కేటాయించాలని మంత్రి పువ్వాడ అజయ్ తెల్లం వెంకట్రావుకి సూచించినట్లు సమాచారం. దీంతోపాటు మరో రెండుమూడు పదవులు మార్చాలని మంత్రి చెప్పడంతో వెంకట్రావు పార్టీ శ్రేణులకు ఫోన్లు చేసి సర్ధిచెబుతున్నట్లు సమాచారం. నిన్నటిదాకా పదవి ఖాయం అనుకొని మురిసిపోయి, నేడు పదవి రావడంలేదని తెలియగానే టీఆర్ఎస్ పార్టీలో చోటా నాయకులు, కార్యకర్తలు భగభగ మండిపోతున్నారు. అన్యాయం, అవమానం జరిగితే పార్టీకి దూరమవుతామని హెచ్చరిక చేస్తున్నారు.

నాయకుల పంతం పార్టీ వినాశనానికే..
నాయకుల నడుమ పంతం పార్టీ నాశనానికే అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు‌. పార్టీ బాగు కంటే నాయకులు తమ పంతం, పట్టింపులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. విభేదాలతో వీధికెక్కి పార్టీ పరువు బజారున పడేస్తున్నారని, అలా వ్యక్తిగత ప్రతిష్ఠలకు పోతున్న మండల నాయకులను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర జిల్లా పార్టీ పెద్దలు పక్కనబెట్టకుండా వెనకేసుక రావడం వల్లనే గ్రూపులు పెరిగి, గొడవలు ముదిరి ప్రజల్లో పార్టీ పలుచన అవుతోందని గులాబీ శ్రేణులు బహిరంగంగా చెబుతున్నారు. పదవుల కోసం పట్టుబట్టి గొడవలు పెట్టుకునేవారు పార్టీ కోసం భవిష్యత్తులో కలిసి పనిచేయడం కష్టమని తేటతెల్లమౌతోంది. నాయకులను పార్టీ పెద్దలు కంట్రోల్ చేయకపోతే గత అసెంబ్లీ, పరిషత్ ఎన్నికల మాదిరిగానే చర్లలో టీఆర్ఎస్ నాయకులు అంతర్గత విభేదాలతో మరోమారు పార్టీని ఓడించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.‌

Tags:    

Similar News