అటెన్షన్.. ఆదివారం కేసీఆర్ ఏం చెప్తారు?

అధికార పార్టీ నేతల్లో అటెన్షన్ మొదలైంది. ఇప్పడు అందరి చూపూ తెలంగాణభవన్ వైపే కేంద్రీక‌ృతమైంది. ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఏం చెప్తారు..? నాయకత్వ మార్పు మీద సంకేతాలిస్తారా..? సాధారణ అంశాలనే ప్రస్తావిస్తారా..? అనేది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ను సీఎంగా ప్రకటిస్తారా..? ఇంతకూ ముఖ్యమంత్రి మార్పు ఎప్పుడు ఉంటుంది..? తదుపరి తాను నిర్వహించబోయే పాత్రపై క్లారిటీ ఇస్తారా..? ఈ ఉత్కంఠకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. కేసీఆర్ […]

Update: 2021-02-05 13:53 GMT

అధికార పార్టీ నేతల్లో అటెన్షన్ మొదలైంది. ఇప్పడు అందరి చూపూ తెలంగాణభవన్ వైపే కేంద్రీక‌ృతమైంది. ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఏం చెప్తారు..? నాయకత్వ మార్పు మీద సంకేతాలిస్తారా..? సాధారణ అంశాలనే ప్రస్తావిస్తారా..? అనేది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ను సీఎంగా ప్రకటిస్తారా..? ఇంతకూ ముఖ్యమంత్రి మార్పు ఎప్పుడు ఉంటుంది..? తదుపరి తాను నిర్వహించబోయే పాత్రపై క్లారిటీ ఇస్తారా..? ఈ ఉత్కంఠకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. కేసీఆర్ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించడంపైనా సమావేశంలో చర్చ జరుగనున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఆదివారం జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి గతంలో ఎన్నడూ లేనంతటి ప్రాధాన్యం సంతరించుకున్నది. సమావేశంలో ఏం జరగనుంది? తదుపరి ముఖ్యమంత్రిగా కేటీఆర్ పేరును కేసీఆర్ ఈ సమావేశంలోనే ప్రకటిస్తారా? ఇకపైన కేసీఆర్ పోషించనున్న పాత్రను వెల్లడిస్తారా? ముఖ్యమంత్రి మార్పు ఎప్పటిలోగా ఉండవచ్చని తెలియజేయనున్నారా?.. ఇవన్నీ ఇప్పుడు పార్టీలో క్రింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకు జరుగుతున్న చర్చ. ఈ సస్పెన్స్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించే అవకాశం లేకపోయినా కార్యకర్తలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో మాత్రం ఈ దిశగా చూచాయగా సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్‌కు పట్టాభిషేకానికి సంబంధించి సూటిగా కాకపోయినా పరోక్షంగా ఏదో ఒక హింట్ ఇచ్చే అవకాశాలున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి కేసీఆర్ బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించడంపైనా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడి మరీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, ఆ పదవికి ఆయన అర్హుడేనని, ఆయనకు అన్ని సమర్థతలూ ఉన్నాయని.. ఇలా రకరకాల కామెంట్లు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, డీసీసీబీ (జిల్లా సహకార బ్యాంకు) అధ్యక్షులు, డీసీఎంస్ అధ్యక్షులు… ఇలా అనేక స్థాయిల్లోనివారంతా ఈ సమావేశానికి రావాల్సిందిగా పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఆహ్వానం పంపారు. గతంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు చాలా జరిగినప్పటికీ ఈసారి జరుగుతున్న తీరు, ఎంచుకున్న సమయం భిన్నంగా ఉండటతో ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

కేటీఆర్‌కు తొందర్లోనే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్తారు… నిర్దిష్టమైన తేదీ ఖరారుకాకపోయినా అతి త్వరలోనే ఉండొచ్చు… కాస్త ఆలస్యమైనా అది కచ్చితంగా జరిగి తీరుతుంది… యాదగిరిగుట్ట ఆలయం ప్రారంభోత్సవం తర్వాత ఉండొచ్చు.. మూఢాలు అయిపోయిన తర్వాత మంచి రోజు చూసుకొని ప్రకటించవచ్చు.. ఎన్నికలు పూర్తయిన అనంతరం ఎప్పుడైనా ఉండొచ్చు.. ఇలాంటి రకరకాల వ్యాఖ్యానాలు వినిపించినా వారం రోజులుగా హఠాత్తుగా ఆగిపోయాయి. ఇకపైన ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా కేసీఆర్ ఈ సమావేశంలో నర్మగర్భంగా సూచనలు చేసే అవకాశం ఉంది. గతంలో ”నాకేం.. నేను దుక్కలాగా ఉన్నాను. నా ఆరోగ్యానికే ఢోకా లేదు… ఇంకో రెండు టర్ములు నేనే సీఎంగా ఉంటాను..” అని అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ ప్రకటించారు. “ఇంకో ఇరవై ఏళ్లు కేసీఆరే సీఎం” అని కేటీఆర్ సైతం వ్యాఖ్యానించారు. అయినా ఇటీవలి కాలంలో పదేపదే కేటీఆర్ పట్టాభిషేకం గురించి వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈ సమావేశంలో ప్రస్తావన చేసే అవకాశం ఉంది.

మూడు ఎన్నికలపై దిశా నిర్దేశం?

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఏడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్న సమయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండడం విశేషం. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు అనుభవాలను ఎదుర్కొన్న సమయంలో రానున్న ఎన్నికల్ల పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ చేదు అనుభవాలు ఎదురైనట్లయితే పార్టీకి ప్రజలు దూరమవుతారని, కేడర్ కూడా డీమోరల్ అవుతారనేది ఆ పార్టీ నేతల ఆందోళన. అందువల్లనే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించి కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది.

గాడి తప్పుతున్న పార్టీ క్రమశిక్షణ

తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక వరకు పార్టీలోని ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణతో ఉన్నప్పటికీ ఆ ఎన్నికల ఫలితాల తర్వాత అది గాడి తప్పిందన్నది పార్టీ అభిప్రాయం. అయోధ్య రామాలయం, రిజర్వేషన్లు తదితర అంశాల్లో ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించాయి. ఆ అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవే అయినప్పటికీ పార్టీకి చెడ్డపేరు తీసుకురావడంతోపాటు బీజేపీకి అనవసరంగా మైలేజీ ఇచ్చినట్లయిందనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. తాజాగా మంత్రి ఈటల రాజేందర్ సైతం పంటల కొనుగోలు కేంద్రాల విషయంలో చేసిన వ్యాఖ్యలు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మధ్య పొంతన లేకుండాపోయింది. ఇవి కూడా పార్టీకి సంకట పరిస్థితిని తీసుకొచ్చాయి.

భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ

కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత పార్టీ నేతలంతా మౌనంగా ఉండిపోయారు. ఢిల్లీ మూడు రోజుల టూర్ తర్వాత రకరకాల విమర్శలు, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇకపైన టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందన్నదానిపై కేసీఆర్ ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు వివరించనున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సంబంధాల విషయంలోనూ కొంత క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో బీజేపీతో రాజకీయంగా తలపడడానికి అవసరమైన వ్యూహం గురించి కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ మూడు ఎన్నికల్లో వచ్చే గెలుపు భవిష్యత్తులో పార్టీ బలపడడానికి, మూడేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గ్రౌండ్ తయారుకావడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేసే అవకాశం ఉంది.

గ్రామ స్థాయిలో రకరకాల సెంటిమెంట్లతో బీజేపీ దూసుకుపోతున్నందున మరే పార్టీకంటే ఎక్కువ సభ్యత్వం ఉన్న టీఆర్ఎస్ మరింత బలపడే దిశగా దిశానిర్దేశం చేయనున్నారు. అప్పటిలోగా ప్రభుత్వం తరఫున పెండింగ్‌‌లో ఉన్న పనులను పూర్తిచేయడం, నిధులను విడుదల చేయడం లాంటివి చోటుచేసుకోనున్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే నల్లగొండ జిల్లా పార్టీ నాయకులతో కేసీఆర్ మాట్లాడడంతో పాటు త్వరలో రూ. 100 కోట్ల విలువైన పనులను ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలను పురస్కరించుకుని అక్కడ కూడా ఇదే తరహా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించే అవకాశం ఉంది.

రెండేళ్ల తర్వాత ప్లీనరీ

ప్రతీ రెండేళ్లకోసారి టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు జరగడం ఆనవాయితీ. 2018 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు, దాని వెన్నంటే వచ్చిన లోక్‌సభ ఎన్నికల కారణంగా 2019 ఏప్రిల్ 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున ప్లీనరీ సమావేశాలు జరగలేదు. గతేడాది కరోనా కారణంగా జరగలేదు. ఈసారి జరగనున్నాయి. ప్లీనరీకి నెల రోజుల ముందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగడం, ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించడం, సంస్థాగత ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీ. ఈసారి మాత్రం దాదాపు రెండు నెలల ముందే ఈ సమావేశాన్ని ఏర్పాటవుతోంది. రాష్ట్ర కమిటీల కూర్పు, ఎన్నికలు, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తదితరాలన్నింటిపైనా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

Tags:    

Similar News