కేసీఆర్, KTR చుట్టూ నేతల ప్రదక్షిణలు.. వారికి మరోసారి MLC ఛాన్స్.?
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ పదవి కోసం ఆశావాహులు ఆరాటపడుతున్నారు. ఖాళీ అయినా 6 స్థానాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవే కావడంతో పోటీ తీవ్రమైంది. అక్టోబర్ మూడోవారంలో నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం జరుగుతుండటంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పదవీకాలం ముగిసిన వారిలో ఎందరికి అవకాశం ఇస్తారు.. ఎవరికి ఉద్వాసన పలుకుతారనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. టికెట్ కోసం సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శాసనసభ్యుల కోటా […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ పదవి కోసం ఆశావాహులు ఆరాటపడుతున్నారు. ఖాళీ అయినా 6 స్థానాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవే కావడంతో పోటీ తీవ్రమైంది. అక్టోబర్ మూడోవారంలో నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం జరుగుతుండటంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పదవీకాలం ముగిసిన వారిలో ఎందరికి అవకాశం ఇస్తారు.. ఎవరికి ఉద్వాసన పలుకుతారనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. టికెట్ కోసం సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
శాసనసభ్యుల కోటా నుంచి ఖాళీ అయిన మండలి స్థానాల కోసం అధికార పార్టీలో పోటీ తీవ్రమవుతోంది. గడువు ఉండటంతో ఉమ్మడి పది జిల్లాల నుంచి నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బయటికి పొక్కకుండా కేసీఆర్, కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు వారు అధికారిక, అనాధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. ఒక్కో జిల్లా నుంచి నాలుగురైదురుగా పోటీ పడుతున్నారు. పార్టీలో పదవులను అనుభవించేవారు కాకుండా ఇతర పార్టీల నుంచి చేరిన కొత్తవారికి మండలిలో స్థానం కల్పించే ఆలోచనలో పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే మండలికి శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీ కాలం జూన్ 3న ముగియగా, ఇదే నెల 16న గవర్నర్ కోటాలో ఎన్నికైన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరి పదవీకాలం ముగిసింది. వీరంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. ఈ జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత కాగా, గవర్నర్ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ స్థానాల కోసం అధికార పార్టీకి చెందిన నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా పావులు కదుపుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఎంపిక విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించి గవర్నర్ ఆమోద ముద్రకోసం ప్రభుత్వం పైల్ పంపింది. సుమారు రెండు నెలలు గడుస్తున్నా నేటికీ ఆమోదం పొందలేదని, గవర్నర్ ఇంకా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గవర్నర్ ఫైల్‌ను తిరిగి పంపిస్తే కౌశిక్ రెడ్డిని కాకుండా మరొకరికి చోటు కల్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 6 స్ధానాలకు ఎవరికి అవకాశం కల్పిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన వారిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలితలు ఉండగా వీరు సైతం మరోసారి అవకాశం కల్పించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తులు చేస్తున్నట్లు తెలిసింది. అయితే నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లులతో పాటు మరొకరికీ ఉద్వాసన పలుకుతారనే ప్రచారం జరుగుతోంది.
ఏదీ ఏమైనప్పటికీ ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్నవారితో పాటు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరి ప్రభుత్వ పథకాలతో పాటు పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్న వారి వివరాలను ఇప్పటికే అధిష్టానం సేకరించింది. గతం నుంచి ఏ పదవులు దక్కని వారికి, యువతకు, వివాద రహితులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. అక్టోబర్ మూడోవారంలో నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఆశావాహులు ఎమ్మెల్సీ స్థానం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటంతో పాటు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమకు కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారని ఇక టికెట్ విషయంలో ఢోకా లేదని కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఇక 6 స్థానాలకు సుమారు 17 మందికి పైగా ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని హామీలు ఇవ్వగా.. ఎవరికి ఇస్తారో అనేది చర్చనీయాశంగా మారింది. మరో విషయం ఏమిటంటే 6 స్థానాల్లో ఇద్దరికి ఉద్వాసన పలికితే 4 స్థానాలకు ఎవరిని నియమిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.