ఈ ఏడాదిలోపే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్
దిశ, తెలంగాణ బ్యూరో : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ సంవత్సరాంతానికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే డిండి ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేసి, నిధులకు ఇబ్బంది లేకుండా తక్షణం రూ.రెండు వేల కోట్లతో పాటు భూములు కోల్పోయిన బాధితుల పరిహారానికి అవసరమైన నిధులను కూడా విడుదల చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా రానున్న వార్షిక బడ్జెట్‌లో కూడా కేటాయింపులు చేయనుంది. ఈ మేరకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ సంవత్సరాంతానికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే డిండి ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేసి, నిధులకు ఇబ్బంది లేకుండా తక్షణం రూ.రెండు వేల కోట్లతో పాటు భూములు కోల్పోయిన బాధితుల పరిహారానికి అవసరమైన నిధులను కూడా విడుదల చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా రానున్న వార్షిక బడ్జెట్‌లో కూడా కేటాయింపులు చేయనుంది. ఈ మేరకు శనివారం ప్రగతి భవన్లో సాగునీటి పారుదల అంశాలపై జరిపిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయాలు తీసుకున్నారని సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
వలసల జిల్లాకు విముక్తి..
వలసల జిల్లా మహబూబ్‌నగర్, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికల్లా వందశాతం పూర్తి చేయడంతో ఇన్నాళ్ల కష్టాలకు విముక్తి లభించనుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రెండు ప్రాజెక్టులకూ నిధుల వరద ఆగొద్దని, రానున్న బడ్జెట్‌లోనూ నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా, వివిధ స్థాయిల అధికారులే నిధులు మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇవ్వడం ఒక చారిత్రక నిర్ణయమని సీఎం వ్యాఖ్యానించారు. నీటి పారుదల శాఖలో విలీనమయ్యే మస్కూరీలకు శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో లష్కర్లుగా ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించారు.
సాగునీటి సౌకర్యంతో పెరిగిన వరి సాగు
‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేది. సాగునీటి వసతి పెరగడంతో ఇప్పుడు కోటి పది లక్షల ఎకరాలకు పెరిగింది. కోటి 25 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతోంది. బోరుబావుల ద్వారా సాగయ్యే భూమి దీనికి అదనం. సాగునీరు అందించడంతో పాటు మిషన్ భగీరథకు కావాల్సిన నీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యత కూడా నీటి పారుదల శాఖదే. దీంతో నీటిపారుదల శాఖ ప్రాధాన్యం, పరిధి పెరిగింది. సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం కోసమే ఆ శాఖ ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది’’ అని సీఎం గుర్తుచేశారు.
అధికారుల స్థాయికి తగిన శాంక్షన్ అథారిటీ
పనులు అనుకున్నట్టు జరిగేలా ఎక్కడికక్కడే నిధుల మంజూరుతో పాటు ఏ స్థాయి అధికారికి ఎంత మొత్తం వరకు శాంక్షన్ అథారిటీ ఉంటుందో కూడా సమావేశంలో సీఎం ప్రస్తావించారు. ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్)కు ఒక్కొక్క పనికి కోటి రూపాయలకు మించకుండా సంవత్సరానికి గరిష్ఠంగా రూ.25 కోట్ల వరకు, చీఫ్ ఇంజినీర్ (సీఈ)కు ఒక్కో పనికి రూ.50 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ.5 కోట్ల వరకు, పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ)కు ఒక్కో పనికి రూ.25 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ.2 కోట్ల వరకు, కార్యనిర్వాహక ఇంజినీర్ (ఈఈ)కు ఒక్కో పనికి రూ.5 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ.25 లక్షల వరకు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ (డీఈఈ)కు ఒక్కో పనికి రూ.2 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక అధికారాలను ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో విద్యుత్ మంత్రి జగదీష్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సురేందర్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఈలు పాల్గొన్నారు.