టూత్‌పేస్ట్‌లో ‘ట్రైక్లోసాన్’.. జాగ్రత్త!
దిశ, వెబ్‌డెస్క్: మీ టూత్‌పేస్ట్‌లో ‘ఉప్పు’ ఉందా? అనే యాడ్ ఫేమస్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మన టూత్‌పేస్ట్‌లో ‘ట్రైక్లోసాన్’ ఉందా? అనే విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మనం రోజూ వాడే సబ్బులు, టూత్ పేస్టులు, ఇతర సౌందర్య సాధనాల్లో ఉపయోగించే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ ‘ట్రైక్లోసాన్’ వల్ల నరాల క్షీణత బారిన పడే ప్రమాదం ఉందని ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ పరిశోధకులు చేసిన […]
దిశ, వెబ్‌డెస్క్: మీ టూత్‌పేస్ట్‌లో ‘ఉప్పు’ ఉందా? అనే యాడ్ ఫేమస్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మన టూత్‌పేస్ట్‌లో ‘ట్రైక్లోసాన్’ ఉందా? అనే విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మనం రోజూ వాడే సబ్బులు, టూత్ పేస్టులు, ఇతర సౌందర్య సాధనాల్లో ఉపయోగించే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ ‘ట్రైక్లోసాన్’ వల్ల నరాల క్షీణత బారిన పడే ప్రమాదం ఉందని ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ పరిశోధకులు చేసిన అధ్యయనలో తాజాగా వెల్లడైంది. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనామిక భార్గవ నేతృత్వం వహించిన ఈ పరిశోధన బ్రిటన్‌కు చెందిన ‘కెమోస్ఫియర్’ జర్నల్‌లో ప్రచురితమైంది. ట్రైక్లోసాన్ ఎందులో కలుపుతారు? ఆ పరిశోధనలో ఇంకేం తెలిసింది?
పలు కంపెనీలు తమ ఉత్పత్తుల కాలపరిమితిని పెంచేందుకు, వాటిల్లో ట్రైక్లోసాన్ అనే రసాయాన్ని కలుపుతాయి. మనం రోజువారీ ఉపయోగించే టూత్ పేస్టులు, మౌత్ వాష్, హ్యాండ్ శానిటైజర్, సబ్బులు, సౌందర్య సాధనాలతో పాటు కొన్ని రకాల దుస్తులు, బొమ్మలు, ఫర్నిచర్, కుకింగ్ బౌల్స్‌లోనూ దీన్ని ఉపయోగిస్తారు. కాగా సదరు ప్రొడక్ట్స్‌లో ట్రైక్లోసాన్ ఎంత కలపాలన్న దానికి ఓ నిర్దిష్టమైన కొలత ఉంటుంది. ఆ పరిమితి కంటే 500 రెట్లు తక్కువగా కలిపినట్లయితే అది మనుషుల నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. కాగా మనం నిత్యం వాడుతున్న అదే తరహా ఉత్పత్తుల కారణంగా ప్రతీరోజు ఎంతోకొంత ట్రైక్లోసాన్ మన శరీరంలోకి వెళ్తుంటుంది. దానివల్ల మన ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదముందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ట్రైక్లోసాన్ ప్రభావం మానవ శరీరంపై ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పరిశోధక బృందం ‘జెబ్రా చేపల’ను ఎంచుకుంది. మానవ శరీర నిర్మాణానికి, ఆ చేపలతో దగ్గర పోలికలు ఉంటాయి. జెబ్రా చేపల్లోని న్యూరాన్లపై ట్రైక్లోసాన్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని, దీంతో నరాల్లోని కణజాలం దెబ్బతినే ముప్పు ఉందని, ఇదే ప్రభావం మానవ శరీరంపై కూడా పడే అవకాశముందని పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ అనామిక చెప్పింది. ఆలోచనలు, ప్రవర్తన, స్పందించే తీరుపై తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుందని ఆమె చెప్పారు. అమెరికాలో సబ్బులు, లిక్విడ్ సబ్బుల్లో ట్రైక్లోసాన్ వాడకాన్ని 2016లోనే నిషేధించగా, కొన్ని రకాల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల్లో మాత్రం మార్కెట్ రివ్యూ లేకుండా వాడటానికి లేదని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2017లో ఆదేశాలు జారీ చేసింది.
ఈ ప్రయోగం ప్రచురితమైన తర్వాత చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌లో ట్రైక్లోసాన్ లేవని ప్రకటనలు చేస్తున్నా, ఆయా ఉత్పత్తుల్లో ఆ హానికారక రసాయనం ఉందో లేదో తెలుసుకోవడానికి ల్యాబ్‌లో పరీక్షించి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది.