ఇక్కడ రెండు కుండల కంటే ఎక్కువ నీరు తీసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే.. ఎక్కడో కాదు మనదేశంలోనే

తాగునీరు సమస్త జీవకోటికి ప్రధాన ఆధారం. ఆ నీరే లేకపోతే భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకమే. ఈ క్రమంలోనే నీటి వృథాను అరికట్టేందుకు ఓ గ్రామం వినూత్న ఆలోచన చేసింది.

Update: 2025-03-31 03:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాగునీరు సమస్త జీవకోటికి ప్రధాన ఆధారం. ఆ నీరే లేకపోతే భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకమే. ఈ క్రమంలోనే నీటి వృథాను అరికట్టేందుకు ఓ గ్రామం వినూత్న ఆలోచన చేసింది. రెండు కుండల కంటే ఎక్కువ నీరు తీసుకెళ్తే భారీగా ఫైన్ చెల్లించాల్సిందేనట. అయితే, ఆ రూల్స్ పెట్టడానికి కారణాలు ఏంటి, అక్కడున్న పరిస్థితుల గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

పూణే నుంచి 71 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్సుల్ గ్రామంలో స్థానిక బావి నుండి రెండు కుండల కంటే ఎక్కువ నీరు తీసుకుంటే ఎవరైనా సరే ₹100 జరిమానా చెల్లించాలి. ఎందుకంటే ఆ గ్రామంలో తీవ్ర నీటి కొరత ఉంది. అలాగే ఆ ప్రాతంలో ఉన్న బావిలో వాటర్‌ను తోడి తోడి లోతు ఎక్కువగా కావడం వల్ల గత రెండు నెలలుగా.. గ్రామస్తులు ఆ లోతైన బావి నుండి నీటిని తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ గ్రామంలో రెండు బావులు ఉండగా.. ఒక బావి నుండి తీసిన నీటిని గృహ అవసరాలకు ఉపయోగిస్తుండగా రెండో బావి నుంచి తీసిన నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు.

ఇక సమ్మర్ స్టార్టింగ్‌లోనే తాగునీటి బావిలో నీటి నిల్వ బాగా తగ్గింది. దీంతో ముందు జాగ్రత్తగా ఎవరూ కూడా ఆ ఆంక్షలను ఉల్లంఘించకుండా చూసుకోవడానికి గ్రామస్తులు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తాగునీటి బావిని జాగ్రత్తగా నిఘా వేస్తున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం 'జల్ జీవన్ మిషన్' అమలు చేసినప్పటికీ పర్సుల్‌కు సరైన నీటి సరఫరా అందకపోవడంతో గ్రామస్తులు నీటి కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో గ్రామంలో కరువు లాంటి పరిస్థితిని నివారించడానికి గ్రామ పంచాయతీ ఈ చర్యలు ప్రారంభించింది.

ఇక పర్సుల్ డిప్యూటీ సర్పంచ్ సరికా బాలాసాహెబ్ షిండే మాట్లాడుతూ.. ‘గ్రామంలో తాగునీరు, గృహ నీటి కొరత ఉంది. 'జల్ జీవన్ మిషన్' పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి, అందుకే మేము అలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా గ్రామస్తులు తమ పశువులను తాగునీటి కోసం రోజూ దాదాపు కిలోమీటరు దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. దీంతో నీటి వృధాను నివారించడానికి జరిమానా విధించడానికి గ్రామస్తులు అంగీకరించారు. ఇది గ్రామస్తులలో క్రమశిక్షణను తీసుకువస్తుంది మరియు వారు నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకుంటారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News