మీకు అండగా ఉంటాం డియర్ కామ్రేడ్…

విజయ్ దేవరకొండ… ముక్కుసూటి మనిషి. అనుకున్నది చేస్తాడు… అనిపిస్తే చెప్పేస్తాడు. తప్పైతే చెంప చెళ్లుమనిపించేలా చెప్తాడు .. చేసింది మంచిపని అయితే ప్రశంసలు కురిపించడంలో ముందుంటాడు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజలకు భోజనం పెట్టేందుకు ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ పేరిట ముందుకొచ్చాడు. ఇంత మంచి సదుద్దేశంతో చేసిన పనిని… కొన్ని వెబ్ సైట్స్ వక్రీకరించి రాయడాన్ని తట్టుకోలేకపోయాడు విజయ్. సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసి […]

Update: 2020-05-05 01:00 GMT

విజయ్ దేవరకొండ… ముక్కుసూటి మనిషి. అనుకున్నది చేస్తాడు… అనిపిస్తే చెప్పేస్తాడు. తప్పైతే చెంప చెళ్లుమనిపించేలా చెప్తాడు .. చేసింది మంచిపని అయితే ప్రశంసలు కురిపించడంలో ముందుంటాడు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజలకు భోజనం పెట్టేందుకు ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ పేరిట ముందుకొచ్చాడు. ఇంత మంచి సదుద్దేశంతో చేసిన పనిని… కొన్ని వెబ్ సైట్స్ వక్రీకరించి రాయడాన్ని తట్టుకోలేకపోయాడు విజయ్. సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసి కడిగిపారేశాడు. మా పని మేము చూసుకుంటుంటే .. ఇంటర్వ్యూలు, యాడ్ లు ఇవ్వలేదని ఇష్టారీతిన ఫేక్ న్యూస్ రాస్తారా.. బుద్ధి ఉండక్కర్లేదా అని సదరు వెబ్ సైట్లపై ఫైర్ అయ్యాడు. నేను విరాళం ఇస్తా ఇవ్వ అది నా ఇష్టం.. ఇంటర్వ్యూ నాకు నచ్చిన వాళ్లకే ఇస్తా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇండస్ట్రీ మీద బతుకుతున్న మీరు… మేము మీకు నచ్చినట్లు బతకాలని శాసిస్తారా… ఇలాంటి సోది, సుత్తి, చెత్త వార్తలు రాస్తారా… రాసుకుంటే రాసుకోండి.. భయపడే ప్రసక్తే లేదన్నాడు. మా డబ్బులు, మా కష్టం, మా ప్రేమ, మా ఆలోచన, మా సేవా కార్యక్రమాలతో ఎంతో విలువైన సమయం కేటాయించి ముందుకు వెళ్తుంటే… రెండు నిమిషాల్లో ఒక చెత్త నెగటివ్ ఆర్టికల్ రాసేసి పైసలు తీసుకుని మీరు చేతులు దులుపుకుంటే… అంత కష్టపడిన మేము మాత్రం మీ సోది వార్తలు చదివి చేతులు ముడుచుకుని కూచోవాలా అంటూ క్లాస్ ఇచ్చాడు విజయ్. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వెబ్ సైట్లలో తాడో పేడో తేల్చుకోవాల్సిందే అన్నట్లు ముందుకొచ్చాడు.

ఈ వీడియో రిలీజ్ చేయగానే ఇండస్ట్రీ నుంచి భారీ సపోర్ట్ వచ్చింది విజయ్ కు. నీతో మేమున్నాం విజయ్ అంటూ… హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోయిన్లు విజయ్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. మన మంచితనం వాళ్లకి చేతగాని తనంగా కనిపిస్తుంది ఒక్కటై బుద్ధి చెప్పాలి అంటూ ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది. గాసిప్ వెబ్ సైట్ల పై పోరాటానికి సన్నద్ధం అయింది.

ఈ క్రమంలోనే డియర్ విజయ్ మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను అన్నారు ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి. బాధ్యతలేని రాతల వల్ల, మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము మీకు అండగా ఉంటాం… మంచి పని చేసేందుకు ముందుకొచ్చిన నీ స్ఫూర్తి ఆగిపోవడానకి వీళ్లేదన్నారు. అలాగే వ్యక్తిగత అభిప్రాయాలను వార్తలుగా రాయోద్దని జర్నలిస్టు మిత్రులను కోరుతున్నట్లు చెప్పాడు.

ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ ను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. మంచి పేరు సంపాదించేందుకు, అభిమానుల ప్రేమను పొందేందుకు, కెరియర్ లో ఉన్నత స్థానాన్ని చేరుకునేందుకు కొన్ని ఏండ్ల కష్టం ఉంటుంది…ఎంతో శ్రమ, పట్టుదల, త్యాగాలు చేస్తేనే మన అభిమానులకు సూపర్ హీరోగా కనిపిస్తాము… కానీ ఎవరో ఒక ముక్కు మొహం తెలియని మనిషి కేవలం డబ్బుకోసం ఒక్క ఆర్టికల్ తో సమాజంలో నువ్వు సంపాదించుకున్న గౌరవం, ప్రేమ, అభిమానాన్ని పోగొట్టేస్తాడు. ఫేక్ న్యూస్ రాస్తూ పరువు తీస్తుంటాడు. అందుకే ఇలాంటి ఫేక్ వార్తల నుంచి నా అందమైన సినీ పరిశ్రమను కాపాడుకునేందుకు నేను విజయ్ తో నిలబడుతున్నాను అంటూ ట్వీట్ చేశారు మహేష్. ఇలాంటి ఫేక్, గాసిప్ వెబ్ సైట్స్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండస్ట్రీ ముందుకు రావాలని కోరాడు.

మాస్ మహారాజ రవితేజ కూడా ఫేక్ వెబ్ సైట్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు విజయ్ కు సపోర్ట్ గా నేనున్నానని తెలుపుతూ ట్వీట్ చేశాడు. అందరూ ఒకటై నిలబడాల్సిన సమయం ఇది… ప్రేక్షకులు, అభిమానులు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేక్ న్యూస్, గాసిప్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా విజయ్ కు అండగా నిలబడింది. సురేష్ ప్రొడక్షన్స్ తరపున ట్వీట్ చేసిన రానా దగ్గుబాటి… చాలా బాగా చెప్పావు విజయ్.. సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ నీకు ఉంటుందని తెలిపారు.

ఇక గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నేనున్నా నీకు విజయ్ అన్నారు. మేమంతా నీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలాగైతే ఇష్టపడతామో అలాగే నువు చేసే ఆఫ్ స్క్రీన్ వర్క్ ను కూడా గౌరవమిస్తాం… ఇలాగే ఇంకా శక్తివంతంగా ముందుకు దూసుకెళ్లు అంటూ ట్వీట్ చేశారు.

ఫేక్ న్యూస్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందుకొచ్చిన విజయ్ కు బిగ్ సెల్యూట్ చేశాడు డైరెక్టర్ క్రిష్. మీడియాకు స్వేచ్ఛ ముఖ్యం అలాగే బాధ్యత కూడా ప్రధానమని తెలుసుకోవాలన్నారు. మేము చూడాలనుకున్న ఆలోచనాత్మకమైన రిపోర్ట్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దయచేసి బాధ్యతారహితమైన, ప్రాణాంతకమైన నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఆపాలని కోరారు.

మా మౌనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దని వెబ్ సైట్లను హెచ్చరించాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఇలాంటి వార్తలు నిజంగా ఆందోళన కలిగిస్తాయని… దయచేసి ఆపాలని కోరారు.

Tags: Vijay Devarakonda, Chiranjeevi, Mahesh Babu, Krish, Raviteja, Vamsi paidipalli, Koratala shiva, Harish Shankar

Tags:    

Similar News