కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కరోనాపై పోరాడేందుకు కేంద్రం వద్ద ఇప్పటి వరకూ ఎలాంటి ప్రణాళికా లేదని కాంగ్రెస్ పార్టీ శనివారం ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిల్ సిబల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కరోనా వైరస్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి జాతీయ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్‌పై ప్రభుత్వం పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లాక్‌డౌన్ ప్రజలకు మాత్రమే ఉండాలనీ, ఆర్థిక వ్యవస్థకు కాదని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాము ప్రభుత్వాన్ని […]
న్యూఢిల్లీ: కరోనాపై పోరాడేందుకు కేంద్రం వద్ద ఇప్పటి వరకూ ఎలాంటి ప్రణాళికా లేదని కాంగ్రెస్ పార్టీ శనివారం ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిల్ సిబల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కరోనా వైరస్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి జాతీయ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్‌పై ప్రభుత్వం పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లాక్‌డౌన్ ప్రజలకు మాత్రమే ఉండాలనీ, ఆర్థిక వ్యవస్థకు కాదని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాము ప్రభుత్వాన్ని విమర్శించడం లేదనీ, ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను పునరాలోచించాలని మాత్రమే చెబుతున్నామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కారణంగా నిస్సహాయులైన నిరుపేదలు, వలసదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోలేవని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించినప్పట్నుంచీ, ప్రధాని మోడీ జాతీయ ప్రసంగాలకే పరిమితమయ్యారనీ, కరోనాపై పోరాటంలో భాగంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందన్న విషయాలను మాత్రం వెల్లడించడంలేదని అన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఈ ప్రయోజనాలను ప్రజలకు ఎందుకు అందజేయడంలేదని నిలదీశారు. సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు ఈ ప్రయోజనాలు అందజేయకుండా కంపెనీలకే అందజేస్తోందని ఆరోపించారు. అలాగే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో న్యాయం అందజేతను అత్యవసర సేవగా పరిగణించే విషయంపై ఓసారి పరిశీలించాలని న్యాయ వ్యవస్థను కోరారు.
tags: congress, kapil sibal, centre has no plan, coronavirus, govt should rethink, delivery of justice