ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు..!
దిశ, ఏపీ బ్యూరో: “చంద్రబాబు కట్టిన ఇళ్లు కావాలో.. జగన్ ఇచ్చే ఇళ్లు కావాలో లబ్దిదారులను వలంటీర్లు అడుగుతారు. 20 ఏళ్లల్లో ఏడు లక్షలకు పైగా రుణం చెల్లించే ఇల్లు కోరుకుంటారో… కేవలం ఒక్క రూపాయికి జగన్ ఇచ్చే ఇల్లు కోరుకుంటారో తేలిపోతుంది!” అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టిడ్కో ఇళ్ల గురించి సమీక్షిస్తూ […]
దిశ, ఏపీ బ్యూరో: “చంద్రబాబు కట్టిన ఇళ్లు కావాలో.. జగన్ ఇచ్చే ఇళ్లు కావాలో లబ్దిదారులను వలంటీర్లు అడుగుతారు. 20 ఏళ్లల్లో ఏడు లక్షలకు పైగా రుణం చెల్లించే ఇల్లు కోరుకుంటారో… కేవలం ఒక్క రూపాయికి జగన్ ఇచ్చే ఇల్లు కోరుకుంటారో తేలిపోతుంది!” అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టిడ్కో ఇళ్ల గురించి సమీక్షిస్తూ 30న కేవలం ఒక్క రూపాయి సేల్‌డీడ్‌తో 300 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇళ్లను పేదలకు అందిస్తామని స్పష్టం చేశారు.
టిడ్కో ద్వారా రాష్ట్రంలో 2,62,216 ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. వాటిలో 300 చదరపు అడుగుల్లో 1,43,600 ఇళ్లు నిర్మాణంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3200 కోట్లు బకాయి పెట్టి పోయిందన్నారు. ఆ బకాయిలు తీరుస్తూనే ఇప్పటికే రూ.1200 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ వారంలో మరో రూ.400 కోట్లు, ఇంకో రూ.600 కోట్లు 15 రోజుల్లో ఇస్తామన్నారు. ఇప్పటిదాకా వాయిదా పడుతూ వస్తోన్న పేదల ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాన్ని డిసెంబరు 25 నుంచి ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.
కోర్టు కేసుల్లో ఉన్నచోట మినహాయించి మిగతా వాళ్లకు పట్టాలు పంపిణీ చేయడంతోపాటు అదే రోజు సుమారు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. మొత్తం 30.68 లక్షల మంది సొంత ఇంటి కల నెరవేరుస్తామని సీఎం ప్రకటించారు. వీధిలో అమ్ముకునే చిరు వ్యాపారులను ఆదుకునేందుకు నవంబరు 25న జగనన్నతోడు పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. లబ్దిదారుడికి పది వేల రుణాన్ని బ్యాంకుల నుంచి ఇప్పించి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 6.29 లక్షల మందికి లబ్ది చేకూరుస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ అమలుపై దృష్టిసారించాలని సీఎం కోరారు. నాడు –నేడు కింద తొలి దశలో 15,715 పాఠశాలల్లో చేపట్టిన పనులను డిసెంబరు నెలాకరుకు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈపాటికే 78 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జగనన్న విద్యా కానుకలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దాలని చెప్పారు. పిల్లకు ఇచ్చిన కిట్‌లో అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీటిపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందని చెప్పారు. పాజిటివిటీ రేటు 9.33 గా ఉన్నట్లు పేర్కొన్నారు. సెకండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఖరీఫ్‌లో వచ్చిన దిగుబడికి సంబంధించి ఏ ఒక్క రైతు వద్ద ఉత్పత్తులు నిల్వ లేకుండా కొనుగోలు చేయాలన్నారు. రబీ ప్రారంభమవుతున్న దృష్ట్యా నీటిపారుదల, విత్తనాలు, ఎరువులు అవసరమైన మేరకు తెప్పించి సిద్ధం చేయాలని ఆదేశించారు.
సీఎం యాప్, ఈ –క్రాప్ లో తప్పనిసరిగా సాగు నమోదు చేయాలని సీఎం చెప్పారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పంట కాలువల్లో గుర్రపుడెక్కను తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబరు నెలాకరుకు రబీ నాట్లు పూర్తయ్యేలా యంత్రాంగం పనిచేయాలని నిర్దేశించారు. వీటన్నింటిపై మంత్రులు, కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.