ఆమెకు రక్షణేదీ..?

దిశ, వరంగల్: 2009 వరంగల్ జిల్లాలో ప్రణితపై యాసిడ్ దాడి ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత మహిళలపై మగాళ్ల అకృత్యాలు ఇక ఉండవని అందరూ అనుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా అలాంటి నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్నవరుస దారుణాలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పట్లో ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కొద్దిరోజుల కిందట హన్మకొండ కొత్తూర్ జెండా డాబాపై తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న పసిపాపను ఎత్తుకెళ్లిన కామాంధుడు అత్యాచారం […]

Update: 2020-03-11 02:29 GMT

దిశ, వరంగల్: 2009 వరంగల్ జిల్లాలో ప్రణితపై యాసిడ్ దాడి ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత మహిళలపై మగాళ్ల అకృత్యాలు ఇక ఉండవని అందరూ అనుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా అలాంటి నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్నవరుస దారుణాలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పట్లో ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కొద్దిరోజుల కిందట హన్మకొండ కొత్తూర్ జెండా డాబాపై తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న పసిపాపను ఎత్తుకెళ్లిన కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేయడం, శంషాబాద్‌లో ‘దిశ’ ఘటన భయాందోళన కలిగిస్తున్నాయి. చిన్నారిపై అఘాయిత్యం తర్వాత నిందితుడికి శిక్ష పడినప్పటికీ భయం లేకుండా కొందరు మగాళ్లు మృగాలుగా మారుతూ ఘోరాలకు పాల్పడుతున్నారు. చిన్నారులను చిదిమేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఇటువంటి ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొమ్మిది నెలల పాప నుంచి తొంభై ఏండ్ల వృద్ధురాలి వరకు మహిళాలోకంపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాల కృషి ఒక్కటే సరిపోదనీ, ప్రజల్లోనూ అవగాహన రావాలని పలువురు మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒంటరి బాలికపై అత్యాచారం

ఈ నెల 1న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ కామాంధుడు ఆరేళ్ల బాలిక‌పై అత్యాచారం చేశాడు. మొగుళ్ల‌పల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన అయిలయ్య, రాజమ్మ‌లకు ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారిని తల్లి వద్ద ఉంచి అయిలయ్య జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. 1న(ఆదివారం) స్కూల్ లేకపోవడంతో మధ్యాహ్నం ఇంటి వద్ద చిన్నారి ఒంటరిగా ఉన్నది. దీంతో అదే గ్రామానికి చెందిన రమేష్ ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లడాన్ని గమనించిన గ్రామస్తులు విషయం ఆరా తీసి ఆ మృగాడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

కాటేస్తున్న రక్త సంబంధీకులూ..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వేర్వేరు చోట్ల ఈ నెల 6న రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. తమ కుటుంబంలోని మహిళలు, చిన్నారులను కాపాడాల్సిన రక్తసంబంధీకులే రాక్షసులుగా ప్రవర్తించారు. పైగా అఘాయిత్యం చేసినట్టు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. వరంగల్ నగరంలోని మట్టెవాడలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై రక్త సంబంధీకులే (బాలిక తండ్రి, మేనమామ) కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బాధితురాలు స్కూల్‌ టీచర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలిక తండ్రి, మేనమామను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొలన్‌పెల్లికి చెందిన వంగాల ఎల్లయ్య(32) రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో ఓ పోలియో బాధితురాలిపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఎల్లయ్యకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

tags :rapes on women, women protection, trs govt

Tags:    

Similar News