గాల్లో కాదు ప్రజల్లోకి వస్తే వారి కష్టాలు తెలుస్తాయి: చంద్రబాబు 

దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీని కౌరవ సభగా మార్చేశారు. అసభ్య పదజాలంతో ఎమ్మెల్యేలు, మంత్రులు దూషణలకు దిగుతున్నారు. నా రాజకీయ జీవితంలో నా సతీమణి ఏనాడూ జోక్యం చేసుకోలేదు. తన పని తాను చేసుకుంటూ ఉండేది. అలాంటి నా సతీమణి గురించి తప్పుగా మాట్లాడారు. రాజకీయాల్లో ఎన్నో ఎదుర్కొన్నా. అలిపిరిలో దాడి జరిగినప్పుడు కూడా బాధ పడలేదు కానీ నా భార్య గురించి అసెంబ్లీలో తప్పుగా మాట్లాడితే బాధనిపించింది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు […]

Update: 2021-11-24 03:39 GMT

దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీని కౌరవ సభగా మార్చేశారు. అసభ్య పదజాలంతో ఎమ్మెల్యేలు, మంత్రులు దూషణలకు దిగుతున్నారు. నా రాజకీయ జీవితంలో నా సతీమణి ఏనాడూ జోక్యం చేసుకోలేదు. తన పని తాను చేసుకుంటూ ఉండేది. అలాంటి నా సతీమణి గురించి తప్పుగా మాట్లాడారు. రాజకీయాల్లో ఎన్నో ఎదుర్కొన్నా. అలిపిరిలో దాడి జరిగినప్పుడు కూడా బాధ పడలేదు కానీ నా భార్య గురించి అసెంబ్లీలో తప్పుగా మాట్లాడితే బాధనిపించింది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. పాపా నాయుడు పేటలో బహిరంగ సభలో మాట్లాడారు. ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే ప్రజలకు ఇలాంటి కష్టాలు వచ్చేవి కాదన్నారు. సీఎం జగన్ గాల్లో వచ్చి గాల్లో వెళ్తున్నారని.. రోడ్డుపైకి వస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయని చంద్రబాబు అన్నారు.

ముందుచూపుతో వ్యవహరిస్తే ఈ ముప్పు తప్పేది

వరదలు వస్తాయని ప్రభుత్వానికి తెలుసు. ఐఎండీ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ముందుచూపుతో వ్యవహరించలేదు. అజాగ్రత్తగా వ్యవహరించింది. గొలుసుకట్టు చెరువులు ఉంటాయి. వరదలు వచ్చే సమయానికి వాటిలోని నీటిని కిందకు విడిచిపెట్టాలి. కానీ అలా చేయలేదు. దీంతో చెరువులు పొంగి వరదలు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశా. జిల్లా అధికారులు సైతం ఎంతో కష్టపడి పని చేశారు. కానీ నేడు వరద బాధితులను పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి, అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలు చనిపోయిన తర్వాత అధికారులు వచ్చి కష్టం తీరుస్తారా..? ప్రభుత్వం చేసే తప్పిదాలను తెలియజేయాలని నాకు ప్రతిపక్షం ఇచ్చారు. ముఖ్యమంత్రికి బుద్ధి, జ్ఞానం ఉంటే వరద బాధితులకు సాయం అందించాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

కౌరవ సభను గౌరవ సభగా మారుస్తా

‘శాసనసభను కౌరవ సభగా మార్చారు. నేను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తా. నా భార్య భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో మాట్లాడారు. ఎన్టీఆర్‌ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారు. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు నా భార్య జోక్యం చేసుకోలేదు. ఏనాడూ సెక్రటేరీయట్‌కు కూడా రాలేదు. నా కారుపై అలిపిరిలో బాంబు దాడి జరిగితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కాపాడారు. ఆ రోజు కూడా నేను భయపడలేదు. బాధపడలేదు కానీ నా భార్యను అంటే బాధనిపించింది. మీ భార్య, తల్లి, చెల్లికి ఇలా జరిగితే బాధపడరా?. ఇలాంటి ఉన్మాదులతో నేను పోరాడాలా..? దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి. ప్రజల్లోకి వెళ్దాం. ఇది ప్రజాస్వామ్యం. ఉన్మాదుల స్వామ్యం కాదు. తప్పుడు పనులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టను’ అని చంద్రబాబు హెచ్చరించారు.

కొందరు పోలీసులు తోకలు జాడిస్తున్నారు

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ‘కొందరు పోలీసు అధికారులు తోకలు జాడిస్తున్నారన్నారు. నేను అసెంబ్లీకి వెళితే ఎగతాళి చేస్తున్నారు. స్ధానిక ఎమ్మెల్యే ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. విశాఖపట్నం వెళితే అడ్డుకున్నారు. నా ఇంటిపై దాడి చేసేందుకు రౌడీలు వచ్చారు. ఎన్టీఆర్ భవన్‌పై దాడి చేశారు. నాపై ఉన్న ప్రేమతో మాట్లాడేందుకు రౌడీలు వచ్చారంట అంటూ వైసీపీ సెటైర్లు వేసింది. మళ్ళీ అధికారంలోకి వస్తా. ప్రజల కష్టాలు తీరుస్తా. 40 ఏళ్లుగా ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్నా. నేను ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడను. రాజకీయాలు నేరస్తుల మయం అయ్యాయి’ అని చంద్రబాబు ఆరోపించారు.

నేను కంపెనీలు తెస్తే.. వైసీపీ దందాలు చేస్తోంది

నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచం అంతా తిరిగాను. అనేక కంపెనీలను ఆహ్వానించా. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రపంచమంతా తిరిగా. కంపెనీలను కూడా తీసుకొచ్చా. నేను కంపెనీలు తెస్తే అందులో వైసీపీ నేతలు వాటాలు కావాలంటున్నారు. దందాలకు పాల్పడుతున్నారు. ఇదెక్కడి దౌర్జన్యం. వైసీపీ నేతల అరాచకాల వల్ల ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు వేరే రాష్ట్రానికి తరలిపోయాయి. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న కంపెనీలు సైతం మూసివేతకు దారి తీశాయి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలో ప్రజలే తేల్చుకోవాలి. నేను వెనక్కి తగ్గను. 5 కోట్ల మంది ప్రజలకు మంచి జరిగే వరకు అలుపెరగని పోరాటం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.

కుప్పంలో దౌర్జన్యాలతో గెలిచారు

కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడి గెలుపొందారు. దొంగ ఓట్లతో గెలిచారు. దొంగ ఓట్లు వేసే వారిని తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకుంది వాస్తవం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పంకు నేరస్తులు వచ్చారు. రౌడీయిజం చేసి గెలుపొందారు. వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. మైనింగ్ మాఫియా చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలకే ఉంది. ఎవరు మంచి చేస్తున్నారో.. ఎవరు ముంచేస్తున్నారో ఈ 5 కోట్ల మంది ప్రజానీకం తేల్చుకోవాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

మాట తప్పిన జగన్

రాజధాని అమరావతి విషయంలో సీఎం రోజుకొక మాట మారుస్తున్నారు. మడమ తిప్పను మాట తప్పను అన్న జగన్ ఎందుకు మాట తప్పుతున్నారు. రైతులు వరి వేయకుండా గంజాయి వేయాలా? అని ప్రశ్నించారు. వరి వేయద్దు అనే అధికారం మంత్రులకు ఎవరు ఇచ్చారు. ప్రజలకు టీడీపీ అండగా ఉంటుంది. నాకు 14 ఏళ్లు ప్రజలు అధికారం ఇచ్చారు. ఇంతకంటే నాకు ఏం కావాలి. పదవులు అవసరం లేదు. కానీ ప్రజలకు న్యాయం చేసేందుకు ఎంతవరకైనా పోరాడతాం. వరద బాధితులకు న్యాయం చేసే వరకు బాధితుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

Tags:    

Similar News