వలస కూలీల తరలింపు బాధ్యత కలెక్టర్లకు..
దిశ, న్యూస్ బ్యూరో: వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాల్సిన బాధ్యతను జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్ సూచించింది. లాక్‌డౌన్‌తో వలస కూలీలు, కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రసార మాధ్యమాల ద్వారా గమనంలోకి తీసుకున్న కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఉపాధి నిమిత్తం చాలా రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ జిల్లాల్లో ఉండిపోయిన వలస కార్మికులు సరైన ఆహారం దొరక్క, షెల్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాలి నడకనే […]
దిశ, న్యూస్ బ్యూరో: వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాల్సిన బాధ్యతను జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్ సూచించింది. లాక్‌డౌన్‌తో వలస కూలీలు, కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రసార మాధ్యమాల ద్వారా గమనంలోకి తీసుకున్న కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఉపాధి నిమిత్తం చాలా రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ జిల్లాల్లో ఉండిపోయిన వలస కార్మికులు సరైన ఆహారం దొరక్క, షెల్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాలి నడకనే వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూళ్ళకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని వ్యాఖ్యానించింది. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ చెక్‌పోస్టు దగ్గర పదుల సంఖ్యలో వలస కార్మికులు సోషల్ డెస్టెన్స్ పాటించకుండా నడుస్తుండడం, తిండికి నోచుకోక సొమ్మసిల్లి పడిపోవడం, సరైన షెల్టర్ కూడా లేకుండా రోడ్డుపైనే నిద్రిస్తుండడం.. ఇలాంటి అంశాలన్నింటినీ కమిషన్ ప్రస్తావించింది. ఇప్పటికైనా జిల్లాల్లో వలస కూలీలు, కార్మికులను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల గుర్తింపు, వర్గీకరణ పూర్తయిన తర్వాత సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు, ఇక్కడే ఉండాలనుకునేవారి కార్మికుల జాబితాను నోడల్ అధికారుల సమన్వయంతో సిద్ధం చేయాలని సూచించింది.
Tags: Telangana, Govt, Lockdown, SHRC, Migrant workers