డ్రీమ్ ఆఫ్ ‘సూపర్ యాప్’
దిశ, ఫీచర్స్: సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో లెక్కకుమించిన యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసేస్తుంటాం. ఫుడ్ ఆర్డర్ నుంచి మొదలుపెడితే హెయిర్ కట్ దాకా ప్రతీ పనికి డిజిటల్ యాప్స్‌పైనే ఆధారపడుతుంటాం. అయితే ఒక్కో పనికి ఒక్కో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మొమొరీ సమస్యతో పాటు ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సర్వీస్‌లన్నింటికీ కలిపి ఒకే ఒక్క యాప్ ఉంటే.. దాన్నే ‘సూపర్ యాప్’ అంటాం. చైనాకు చెందిన ‘వీచాట్, అలీపే’ సూపర్ యాప్స్‌కు ది బెస్ట్ […]
దిశ, ఫీచర్స్: సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో లెక్కకుమించిన యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసేస్తుంటాం. ఫుడ్ ఆర్డర్ నుంచి మొదలుపెడితే హెయిర్ కట్ దాకా ప్రతీ పనికి డిజిటల్ యాప్స్‌పైనే ఆధారపడుతుంటాం. అయితే ఒక్కో పనికి ఒక్కో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మొమొరీ సమస్యతో పాటు ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సర్వీస్‌లన్నింటికీ కలిపి ఒకే ఒక్క యాప్ ఉంటే.. దాన్నే ‘సూపర్ యాప్’ అంటాం. చైనాకు చెందిన ‘వీచాట్, అలీపే’ సూపర్ యాప్స్‌కు ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ కాగా.. ఇండియాలో ఇప్పటివరకు ఇలాంటి సక్సెస్‌ఫుల్ ‘సూపర్ యాప్’లు లేవనే చెప్పాలి. అయితే ఇక్కడ కూడా ఆల్‌టైమ్ గ్రేట్ ‘సూపర్ యాప్’ను తీసుకొచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘టాటా గ్రూప్’ తాజాగా ‘బిగ్ బాస్కెట్, 1ఎంజి (ఆన్‌లైన్ ఫార్మసీ ప్లాట్‌ఫామ్)’తో చర్చలు జరుపుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ మేరకు రెండు కంపెనీల్లోనూ గణనీయమైన వాటాను పొందే వీలుందని అంటున్నారు. దీన్నిబట్టి భారతీయ పారిశ్రామికవేత్తలకు సూపర్ యాప్ ఇప్పటికీ ఓ డ్రీమ్ యాప్‌గా ఉందని చెప్పొచ్చు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘డిజిటల్ మాల్’కు యాప్ రూపమే ‘సూపర్ యాప్’. మనం డిజిటల్ మాల్‌కు వెళితే.. స్నేహితులతో మాట్లాడుకోవచ్చు, ఇష్టమైనవి కొనుగోలు చేయొచ్చు, మాల్‌లో ఏటీఎం సేవలు పొందవచ్చు, అక్కడున్న రెస్టారెంట్‌లోనే ఫుడ్ తినొచ్చు. ‘సూపర్ యాప్’లోనూ అంతే! యాప్ ఓపెన్ చేసి.. హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, కిరాణా సామగ్రి, మెడిసిన్ కొనుగోలు చేయొచ్చు. బట్టల షాపింగ్, ఫుడ్ ఆర్డర్‌తో పాటు రుణాలు కూడా పొందొచ్చు. ఇవన్నింటినీ ఒకే చోట అందుకోవచ్చు. ఒకవేళ టాటా సంస్థ.. సూపర్ యాప్‌లో సక్సెస్ సాధిస్తే, ఇందుకోసం ప్రణాళికలు రచిస్తున్న రిలయన్స్, అమెజాన్‌లు కూడా సూపర్ స్పీడ్‌తో సూపర్ యాప్ తీసుకొచ్చే అవకాశముంది.
అవసరముందా?
మనదేశంలో స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ఎక్కువే అన్నది తెలిసిన విషయమే. అయితే యూజర్స్ ఎక్కువ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల మెమొరీ ‘స్పేస్’ను కోల్పోతున్నారు. ప్రతీ ముగ్గురు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో ఒకరు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లు సిలికాన్ వ్యాలీలోని గూగుల్ పరిశోధకుల బృందం వెల్లడించింది. ఇందుకు మరో ప్రధాన కారణం ‘గుడ్ మార్నింగ్’. ఇదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? చాలా మంది ఉదయం నిద్రలేవగానే స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయులు అందరికీ గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు చేస్తుంటారు. మిలియన్ల మందికి ఈ అలవాటు ఉండగా, ఆ గుడ్ మార్నింగ్ ఫొటోలతో స్పేస్ లాస్ అవుతున్నారు. ఈ కారణాల వల్లే ‘సూపర్ యాప్’ వస్తే ఫోన్‌లో మెమొరీ తగ్గుతుందని యూజర్లు భావిస్తున్నారు.
ఏం ఉండాలి?
సూపర్ యాప్ ఇప్పటివరకు ఎందుకు సృష్టించలేకపోయారు? అంటే అది క్లిక్ కావాలన్నా, ప్రజల ఆదరణ పొందాలన్నా తప్పనిసరిగా మూడు సర్వీస్‌లను అద్వితీయంగా అందించాల్సి ఉంటుంది. వాట్సాప్ మాదిరి.. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులను కమ్యూనికేట్ చేయడానికి ఓ వేదికలా ఉండాలి. అదే విధంగా మీడియా, గ్రాసరీ, ఫుడ్ డెలివరీ, క్లాత్స్ ఇతర ఇ-కామర్స్ సౌకర్యాలతో పాటు సేవలను అందించాలి. చివరగా ఇంటిగ్రేటెడ్ పేమెంట్స్ సొల్యుషన్ సర్వీస్ ఇస్తూనే, మరికొన్ని ఫైనాన్స్ సర్వీస్‌లను ఇవ్వాలి. ఇండియాలో చాలా కంపెనీలు ఈ సేవలను అందిస్తున్నప్పటికీ, ఏ కంపెనీ కూడా అన్నింటినీ కలిపి అందించలేకపోయింది. ఉదాహరణకు : పేటీఎం మొదట పేమెంట్స్ యాప్‌గా ప్రారంభ కాగా, ఆ తర్వాత ఈ-కామర్స్‌గా రూపాంతరం చెందింది. కానీ రెండింటినీ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయలేకపోయింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లు సోషల్ మీడియా గేమ్‌ను ఛేదించినా, డిజిటల్ వాలెట్స్ సేవల్లో మాత్రం పురోగతి సాధించలేకపోయాయి. రిలయన్స్ జియో, వాట్సాప్‌తో భాగస్వామి కావడానికి ప్రయత్నిస్తూనే జియో మార్ట్‌ను, జియో పేమెంట్స్‌ను పరిచయం చేయడం ద్వారా ‘సూపర్ యాప్’గా ఎదిగేందుకు మార్గాన్ని వెతుక్కుంది. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం అన్ని పనులకు ‘వీచాట్’ గేట్ వేగా కనిపిస్తుండగా, ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ ‘వీచాట్’ను పోలిన సూపర్ యాప్‌ను తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు.
వర్క్‌వుట్ అవుతాయా?
చైనాతో పోల్చితే ఇండియన్ యూజర్ల మైండ్ సెట్ వేరు. చైనా మార్కెట్‌లో పోటీ లేకపోవడంతో, అక్కడి మార్కెట్‌లో ‘సూపర్ యాప్’ ఫార్ములా గ్రాండ్ సక్సెస్ సాధించింది. కానీ ఇక్కడ ఆ మోడల్‌ను రిప్లికేట్ చేయడం అసాధ్యం కాదు కానీ, సక్సెస్ చేయడమే చాలా కష్టం. ఇదొక కోణం అయితే.. స్పెసిఫైడ్, స్పెషలైడ్ సర్వీస్ అందించే ఉత్తమమైన, పేరొందిన యాప్స్ ఇక్కడ అనేకమున్నాయి. ఉదాహరణకు క్యాబ్ సర్వీస్ కోసం ‘ఉబర్, ఓలా’ వంటి సంస్థలుండగా.. ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ‘జొమాటో, స్విగ్గీ, ఫుడ్ పాండా’ కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీస్‌లు అందిస్తూ ది బెస్ట్ అనిపించుకుంటున్నాయి. గ్రాసరీ పరంగా చూసుకుంటే.. ‘బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, నేచర్స్ బాస్కెట్’ ఉండగా, ఇటీవలి కాలంలో ‘జియో మార్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్’ వచ్చి చేరాయి. ఇక ‘ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, మొబిక్విక్, వాట్సాప్ పే, అమెజాన్ పే’ ఇప్పటికే డిజిటల్ వాలెట్స్‌గా కస్టమర్స్ ఆదరణ అందుకుంటున్నాయి. ఈ సర్వీస్ బేస్డ్ యాప్స్ ప్రారంభించిన కంపెనీలన్నీ కూడా ఇండియన్ యూజర్ల బిహేవియర్, మెంటాలిటీని అర్థం చేసుకోవడానికి ఎంతో ఖర్చుతో పాటు ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాయి. కస్టమర్లకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ క్లిక్ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ‘టాటా, అమెజాన్ లేదా రిలయన్స్’ వంటి సంస్థలు బిలియన్ డాలర్లను ఖర్చు చేసి ‘సూపర్ యాప్’ తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు కానీ, ఆయా ప్లాట్‌ఫామ్‌లకు అలవాటు పడిన కస్టమర్లను తాము తీసుకువచ్చే ‘సూపర్ యాప్’ వైపు దృష్టి మళ్లించేలా చేయడమే ఈ దిగ్గజాలకు బిగ్ సవాల్. ఈ క్రమంలో 120 కోట్లకు పైగా జనాభా కలిగివున్న భారతదేశంలో ‘ఒరిజినల్ సూపర్ యాప్’ రేస్‌లో ఎవరు సక్సెస్ సాధిస్తారో చూడాలి.