కేరళలో ‘1977’ రిపీటయ్యేనా?

న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అధికార ఎల్‌డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు సీట్ల పంపకాల్లో మునిగిపోయాయి. అధికారమే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. క్యాంపెయిన్‌లు చేస్తున్నాయి.తమిళనాడు తరహాలోనే కేరళలోనూ అధికారం ఈ రెండు కూటముల మధ్యే మార్పిడి జరుగుతున్నది. కేరళలో ప్రతి ఐదేళ్లకోసారి వంతులు వేసుకున్నట్టుగా ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. ప్రస్తుతం విపక్షంలో ఉన్న యూడీఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలని కత్తులు నూరుతున్నది. అధికార ఎల్‌డీఎఫ్ ‘1977’ విజయాన్ని […]

Update: 2021-03-01 22:44 GMT

న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అధికార ఎల్‌డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు సీట్ల పంపకాల్లో మునిగిపోయాయి. అధికారమే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. క్యాంపెయిన్‌లు చేస్తున్నాయి.తమిళనాడు తరహాలోనే కేరళలోనూ అధికారం ఈ రెండు కూటముల మధ్యే మార్పిడి జరుగుతున్నది. కేరళలో ప్రతి ఐదేళ్లకోసారి వంతులు వేసుకున్నట్టుగా ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. ప్రస్తుతం విపక్షంలో ఉన్న యూడీఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలని కత్తులు నూరుతున్నది. అధికార ఎల్‌డీఎఫ్ ‘1977’ విజయాన్ని రిపీట్ చేయాలని ఉబలాటపడుతున్నది. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, సీపీఐల సారథ్యంలోని ఫ్రంట్ మరోసారి అధికారాన్ని కాపాడుకుంది. తర్వాత ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతూనే ఉన్నది. 1977 తరహాలోనే ఈ సారి రెండోసారీ అధికారంలో కొనసాగాలని ఎల్‌డీఎఫ్ గట్టిగా ప్రయత్నిస్తున్నది. సీపీఎం పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. బెంగాల్, త్రిపురలో ఇప్పటికే సీపీఎం అధికారాన్ని కోల్పోయింది. ప్రస్తుతం కేవలం కేరళలోనే అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ పరాజయం పాలైతే దేశంలో ఏ రాష్ట్రంలోనూ వామపక్షం అధికారంలో లేనట్టవుతుంది. కాగా, బీజేపీ డబుల్ డిజిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ బోణీ కొట్టింది. ఈ సారి కనీసం ఐదు నుంచి పది స్థానాలకు పెంచుకుని మెరుగవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఎన్నికల సంఘం 140 సీట్లున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 6న సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగ్గా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

స్థానిక ఎన్నికల ఫలితాలతో ఎల్‌డీఎఫ్‌లో హుషారు

2016 అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాలను మెరుగుపరుచుకుని ఎల్‌డీఎఫ్ 91 సీట్లను కైవసం చేసకుంది. యూడీఎఫ్ 47 స్థానాలకు పడిపోయింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 72 సీట్లను గెలుచుకుంది. యూడీఎఫ్ 25 స్థానాలను కోల్పోగా ఎల్‌డీఎఫ్ 23 సీట్లను మెరుగుపరుచుకుని అధికారాన్ని పొందింది. ఈ మొత్తం స్థానాల్లోనూ వ్యతిరేకత రానివ్వకుండా అధికారకూటమి జాగ్రత్త పడినట్టు తెలుస్తున్నది. గతేడాది చివరిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ ఘన విజయాన్ని నమోదుచేసుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు. స్థానిక ఫలితాలు ఎల్‌డీఎఫ్‌కు సానుకూల పవనాలను వెల్లడిస్తున్నాయని అధికారవర్గాలూ భావిస్తున్నాయి. సాధారణంగా అధికారంలోని పార్టీపట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఐదేళ్లు కావస్తున్న తరుణంలో స్థానికంలో మంచి ఫలితాలు సాధించడం గమనార్హం. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం ఎల్‌డీఎఫ్ కూటమికి కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో తొలి నుంచీ పినరయి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలూ ఎల్‌డీఎఫ్‌కు కలిసిరానున్నాయి. ప్రకృతి విపత్తులు, వరదలు, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం మన్ననలు పొందింది. గోల్డ్ స్కాంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలూ ఒకరకంగా అధికార పక్షానికి కలిసొచ్చింది. ఈ స్కాంపై సుమారు ఏడునెలలు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఇన్వెస్టిగేట్ చేసినా సర్కారుకు వ్యతిరేకంగా ఆధారాలు లభించకపోవడాన్ని ఎల్‌డీఎఫ్ వినియోగించుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపునకు దిగుతున్నదని విమర్శలు చేస్తున్నది. క్రిస్టియన్లు యూడీఎఫ్ అధికారంలోకి రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తద్వార ముస్లిం, క్రైస్తవుల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. యూడీఎఫ్‌కు చెందిన జోస్ కే మణి ఎల్‌డీఎఫ్‌లో చేరడంతో మధ్య కేరళలోని యూడీఎఫ్ ఓటు బ్యాంకు ఎల్‌డీఎఫ్ గండిపెట్టనున్నట్టు విశ్లేషణలు వస్తున్నాయి.

డీప్ సీ ఫిషింగ్‌ ఒప్పందంపై ఆరోపణలు

యూడీఎఫ్ కూటమి అధికారపక్షంపై ప్రధానంగా అవినీతి ఆరోపణలను సంధిస్తున్నది. అమెరికా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న డీప్ సీ ఫిషింగ్ ఒప్పందంతో రాష్ట్ర మత్స్య కార్మికులు నష్టపోతారని ఆరోపణలు చేస్తున్నది. అభిప్రాయబేధాలను పక్కనపెట్టి ఉమెన్ చాందీ, రమేశ్ చెన్నితల, ముల్లప్పల్లి రామచంద్రన్ క్యాంపెయిన్ కోసం ఏకతాటి మీదకు రావడం యూడీఎఫ్‌కు కలిసి రానుంది. ఐయూఎంఎల్(ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్) జాతీయ కార్యదర్శి పీకే కున్హలికుట్టీ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడమూ కూటమికి బలం చేకూర్చనుంది. ఎల్‌డీఎఫ్ కూటమిలోని ఎన్‌సీపీ నుంచి మణి సీ కప్పన్, ఏఎన్ రాజన్ బాబు సారథ్యంలోని జేఎస్ఎస్, జార్జ్ థామస్ నేతృత్వంలోని జేడీఎస్‌లు యూడీఎఫ్‌లోకి చేరడం ప్రతిపక్షానికి కలిసిరానుంది. మణి సీ కప్పన్‌తో ట్రావెన్‌కోర్‌లోని ఓట్లు యూడీఎఫ్‌ పక్షానికి పడే అవకాశముంది.

Tags:    

Similar News