ఇక ‘హస్తం’ అంతేనా.?

గ్రేటర్ ఎన్నికలను అన్నిపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కానీ ఓటమికి అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్‌గా రేవంత్ రెడ్డి, అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలెవరూ ప్రచారం చేయలేదు. టీఆర్ఎస్ కేడర్ అంతా నగరంలోనే మకాం వేస్తే, బీజేపీ కేంద్ర మంత్రులతోపాటు, పార్టీ ఇతర రాష్ట్రాల నేతలను సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో విజయవంతంగా వినియోగించుకుంది. అలాంటిది కాంగ్రెస్ తరఫున ప్రచారంలో జిల్లా నుంచి ఒక్కరిద్దరు మాత్రమే అడపాదడపా కనిపించారు. […]

Update: 2020-11-29 21:55 GMT

గ్రేటర్ ఎన్నికలను అన్నిపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కానీ ఓటమికి అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్‌గా రేవంత్ రెడ్డి, అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలెవరూ ప్రచారం చేయలేదు. టీఆర్ఎస్ కేడర్ అంతా నగరంలోనే మకాం వేస్తే, బీజేపీ కేంద్ర మంత్రులతోపాటు, పార్టీ ఇతర రాష్ట్రాల నేతలను సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో విజయవంతంగా వినియోగించుకుంది. అలాంటిది కాంగ్రెస్ తరఫున ప్రచారంలో జిల్లా నుంచి ఒక్కరిద్దరు మాత్రమే అడపాదడపా కనిపించారు. మిగతావాళ్లు ప్రచారానికి రాలేదనే అపవాదు రాకూడదనుకున్నారో ఏమో ఆఖరి రోజు రోడ్ షోల్లో పాల్గొని మమ అనిపించారు. ఈ నేపథ్యంలో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని, పార్టీ పని అయిపోయినట్లేనని పలువురు చర్చించుకుంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పంథా మారడం లేదు. ఒకరు ముందుకు పరుగెతుత్తుంటే.. నలుగురు వారి కాళ్లల్లో కట్టెలు పెట్టినట్లు వ్యవహరిస్తారు. ఇది ఆ పార్టీకి ముందు నుంచీ వస్తున్న ఆచారమే. ఈసారి కూడా అదే పాటించారు. దీనిపై పార్టీలో పలు రకాల ప్రచారం సాగుతోంది. టీపీసీసీ చీఫ్ మారుస్తారనే ఊహగానాల నేపథ్యంలో పార్టీ నేతలు ఒకరికే క్రెడిట్ రాకుండా ప్రచారానికే దూరమైనట్లు తెలుస్తోంది. గ్రేటర్‌లో పార్టీ తరుఫున అభ్యర్థులు గెలిస్తే వారికి వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏమీ ఉండవనే ప్రధాన కారణంతో ఒకరి వెంట ఒకరు ఇండ్లకే పరిమితమయ్యారు. కొంతమంది గ్రేటర్‌ అభ్యర్థులు తాము గెలిచే అవకాశాలున్నాయని, ప్రచారానికి రావాలంటూ రాష్ట్ర నేతలకు మొర పెట్టుకున్నారు. కానీ వారి ముఖమే చూడలేదు.

ఇతర పార్టీలను చూసైనా..

గ్రేటర్ ఎన్నికల్లో ఆయా పార్టీల తరుఫున అగ్ర నేతలు రంగంలోకి దిగారు. అధికార పార్టీ మంత్రి మండలి మొత్తం పాగా వేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు.. ఇలా కేడర్ మొత్తం నగరంలోనే మకాం వేసింది. శనివారం సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. అటు బీజేపీ గ్రేటర్ ఎన్నికలకు టాప్ ప్రియార్టీ ఇచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల విజయంతో నయా జోష్‌తో ఉరకలేశారు. బీజేపీ తరఫున కేంద్రమంత్రులు, యూపీ సీఎం, మహారాష్ట్ర మాజీ సీఎంతో పాటు చాలా మంది నేతలతో ప్రచారం చేసింది. అదే విధంగా టీడీపీ, వామపక్షాలు, టీజేఎస్ లాంటి పార్టీల నేతలు సైతం వారివారి స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కానీ కాంగ్రెస్ మాత్రం చాంతాడంత నేతలను రాష్ట్రంలో పెట్టుకుని ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొనలేదు.

రోజూ రేవంత్… అప్పుడప్పుడు ఉత్తమ్

కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా కనిపించారు. తాను ప్రాతినిధ్యం వహించే మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటుగా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. రేవంత్ క్రేజీతో చాలా చోట్ల అభ్యర్థులు కూడా పోటీ చేశారు. ఇక టీపీసీసీ ఉత్తమ్ చేసీ చేయనట్టుగానే ప్రచారంలో పాల్గొన్నారు. వీరితో పాటుగా ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రచారంలో కనిపించారు. ఒకటీ, రెండు డివిజన్లలో వీ హనుమంతరావు వెళ్లినా వెంటనే తిరిగి వచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పఠాన్‌చెరు నియోజకవర్గంలో ఒక్క రోజు ప్రచారం చేసి మాయమయ్యారు. ఈ నేపథ్యంలో ఆఖరి రోజున సాయంత్రం కొంతమంది నేతలు ఆయా ప్రాంతాల్లో రోడ్​షోల్లో పాల్గొన్నారు.

కొంతమంది ఉన్నా లేనట్టుగానే..

కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అసలు సమయంలో కనిపించలేదు. కొంతమంది ఉన్నా లేనట్టుగానే ఉన్నారు. అయితే గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఉన్నామంటూ ముఖం చూపించారు. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్ రెడ్డి, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ అజహరుద్దీన్ అసలు కనిపించలేదు. అలాగే టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీ, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, వంశీతో పాటుగా నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్ కుమార్, అద్దంకి దయాకర్, శ్రీనివాస్ కృష్ణన్, మైనార్టీ నేతల జాఫర్, అమీర్, జావేద్, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, నిరంజన్, కుసుమ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు.

మేనిఫెస్టో విడుదల చేసివెళ్లి మళ్లీ రాలే..

బీజేపీ అగ్రశ్రేణి నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా వచ్చి ప్రచారం చేస్తే కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా కానరాలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సైతం కేవలం గాంధీభవన్‌కు ఒక్కరోజు వచ్చి మేనిఫెస్టో విడుదల చేసి వెంటనే ఫ్లైటెక్కారు. ఇప్పటి వరకు మళ్లీ రాలేదు. ఠాగూర్, ఇతర నేతలు కలిసికట్టుగా ప్రచారం చేస్తే కొంతైనా కలిసి వస్తుందని భావించిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలకు ఈ ఎన్నికల ప్రచారంలో నిరాశే ఎదురైంది.

Tags:    

Similar News