బల్దియా చరిత్రలో భారీ స్కామ్‌.. అక్షరాల ఎంతంటే..?

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్‌ నగరంలో గతేడాది సంభవించిన వరదలు మరిచిపోలేనివి. ఇటువంటి కష్టకాలంలో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థికసాయం పంపిణీలో భారీ అవకతవకలు జరిగాయని ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. అవి నిజమేననే తీరులో జీహెచ్ఎంసీ అధికారి వివరణ స్పష్టం చేస్తున్నది. భారీ వర్షాలు, వాటి వెంట వచ్చిన వరదల కారణంగా నీట మునిగిన ప్రాంతాల్లోని వరద బాధితుల్లో 4.13 లక్షల కుటుంబాలకు నగదు రూపంలో పంపిణీ చేశామని, మరో 1.23 లక్షల కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లో […]

Update: 2021-07-21 19:00 GMT

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్‌ నగరంలో గతేడాది సంభవించిన వరదలు మరిచిపోలేనివి. ఇటువంటి కష్టకాలంలో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థికసాయం పంపిణీలో భారీ అవకతవకలు జరిగాయని ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. అవి నిజమేననే తీరులో జీహెచ్ఎంసీ అధికారి వివరణ స్పష్టం చేస్తున్నది. భారీ వర్షాలు, వాటి వెంట వచ్చిన వరదల కారణంగా నీట మునిగిన ప్రాంతాల్లోని వరద బాధితుల్లో 4.13 లక్షల కుటుంబాలకు నగదు రూపంలో పంపిణీ చేశామని, మరో 1.23 లక్షల కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డిసెంబరులో పేర్కొన్నారు. కానీ జీహెచ్ఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ మాత్రం మొత్తం 6,66,529 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేసినట్లు సమాధానమిచ్చారు. ఈ గణాంకాల్లో ఏది నిజమో తేల్చుకోవడం ఇప్పుడు ప్రజల వంతయింది.

ఏ సర్కిల్‌లో ఎంతమందికిచ్చారో, ఏఏ ప్రాంతాలకు చెందిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయో మాత్రం స్పష్టమైన సమాచారం లేదని అడ్వయిజర్ పేర్కొన్నారు. ఏ సర్కిల్‌లో వరద ప్రభావం ఎక్కువగా ఉన్నదో, ఆ ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు సాయం అందుకున్నాయో, ఇంకా ఎంత మందికి అందాల్సి ఉన్నదో కూడా వివరాలు లేవన్నారు. నిధులను సమకూర్చుకోవడంపై చూపుతున్న శ్రద్ధ వాటిని పొదుపుగా, అవసరమైన చోట ఖర్చు చేసేందుకు వినియోగించటం లేదని తేలిపోయింది.

రూ. కోటి 20 లక్షల మందికి చెందిన ప్రజాధనాన్ని అధికార పార్టీకి అప్పనంగా కట్టబెట్టారా..?, వరద బాధితులకు నిజంగానే పంపిణీ చేస్తే, వారి వివరాలెందుకు ఉండవనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని డివిజన్లలోని వరద బాధితుల వివరాలను పరిశీలించిన తర్వాతనే ప్రత్యేక బృందాల ద్వారా వరద సాయం నగదు రూపంలో పంపిణీ అయినప్పుడు కనీసం సర్కిళ్ళ వారీగా వివరాలు ఎందుకు లేవనే ప్రశ్నకు సమాధానం లేదు.

బల్దియా ఎన్నికలకు ముందు జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ టికెట్ ఆశావాహులు కలిసి గల్లీ గల్లీ తిరుగుతూ, బాధితులను తమ వెంట తిప్పుకుంటూ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. కానీ వీరిలో ఎంత మంది నిజమైన బాధితులు, లబ్దిదారులు అనే వివరాలు అప్పట్లో అంతుచిక్కలేదు. అధికారులు సైతం గణాంకాలను వెల్లడించడానికి నిరాకరించారు. గట్టిగా ప్రశ్నించినవారిపై అధికార పార్టీ నేతలు దాడులు చేసిన ఘటనలు సైతం ఉన్నాయి. ప్రజలకు జవాబుదారీగా, బాధ్యతాయుతంగా వ్యవహారించాల్సిన బల్దియా అధికారులు గులాబీ సైన్యంగా వ్యవహారించారనే ఆరోపణలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

సుమారు రూ. 666.52 కోట్ల ప్రజాధనాన్ని దారి మళ్లించేందుకు అధికార పార్టీతో కలిసి వరద సాయం డ్రామాకు తెర దీశారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. డిసెంబర్‌లో జరిగిన బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లను సమీకరించేందుకే బల్దియా అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే గాక, బల్దియా నిధులను కూడా దారి మళ్లించారని బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. ఎన్నికల కోసమే వరద సాయం పంపిణీ చేస్తే చివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. ఆర్థిక సహాయానికి నోచుకోని బాధితులు ‘మీ సేవ‘ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ అప్పట్లోనే పిలుపునిచ్చారు. దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో బాధితులు తెల్లవారుజాము నుంచే మూడురోజుల పాటు ‘మీ సేవ‘ కేంద్రాల ముందు బారులు తీరారు.

కానీ ఎన్నికలు ముగిసి దాదాపు ఏడున్నర నెలలు గడుస్తున్నా, అప్లై చేసుకున్న వారి ఖాతాల్లో సాయం జమ కాలేదు. ఫొటో ఫినిషింగ్ కోసమేనా? ‘మీ సేవ‘ కేంద్రాల ద్వారా ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించలేదని జీహెచ్ఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ప్రజలు నరకయాతన అనుభవించి దరఖాస్తు చేసుకుంటే చివరకు అవన్నీ వృథా అయిపోయాయి. ఒక్క దరఖాస్తుకు కూడా వరద సాయం ఇవ్వలేదని తేల్చేశారు. స్వయంగా మంత్రే దరఖాస్తు చేసుకోవాలని చెప్పినా చివరకు వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న ప్రజల శ్రమ, సమయం వేస్ట్ అయింది.

ఆధార్ కార్డు వివరాలతో సహా…

ఆర్థిక సహాయం ఇస్తున్న సమయంలో బాధితుడి ఆధార్ కార్డుతో తీసిన ఫొటోలు ఇపుడేమైనట్టు? అనే ప్రశ్నకు జీహెచ్ఎంసీ నుంచి సమాధానం లేదు. ఆర్థిక సహాయమిస్తున్నట్లు అప్పట్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఫొటోలు సైతం దిగి పబ్లిసిటీ చేసుకున్నారు. ఈ అవసరం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను కూడా రూపొందించింది. బాధితుల ఆధార్ కార్డు నెంబర్, ఇంటి నెంబర్, డివిజన్ నెంబర్, వీధి పేరు.. ఇలాంటి వివరాలన్నింటినీ ఆ యాప్‌లో ఫీడ్ చేశారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ఇంత తతంగం జరిగినా చివరకు సర్కిళ్ళ వారీగా వివరాలు తమ దగ్గర లేవంటూ అడ్వయిజర్ చెప్పడం వరద సాయం పంపిణీలో ఎంత పారదర్శకత ఉందో తేటతెల్లం చేసింది.

నగరంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా స్థానిక సంస్థగా ముందుండి సహాయక చర్యలను పర్యవేక్షించటం, అవసరమైన సహాయం చేయాల్సిన బాధ్యత బల్దియాది. కనీసం చనిపోయిన వారి వివరాలు కూడా లేవని అడ్వయిజర్ చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది. ఉద్దేశపూర్వకంగానే వివరాలను తొక్కిపెడుతున్నదనే సందేహాలు కలుగుతున్నాయి. ఆ వివరాలు వెలుగులోకి వస్తే వరదసాయం పంపిణీలో జరిగిన అవకతవకలు బైటపడతాయనేదే జీహెచ్ఎంసీ భయం కాబోలు! బల్దియా దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్లకు ఏ రోగి వచ్చారు, వారికి ఎలాంటి వైద్యం అందించాం లాంటి అనేక రకాల సమాచారం ఏళ్ల తరబడి సేఫ్‌గా ఉంటుంది. గ్రేటర్ పరిధిలో ఎవరు ఎక్కడ పుట్టినా, చనిపోయినా వారి వివరాలు కూడా భద్రంగా ఉంటాయి. కానీ, వందల కోట్ల రూపాయల వరద సాయం వివరాలు మాత్రం రికార్డుల్లో లేకపోవడం గమనార్హం.

Tags:    

Similar News