ఆస్ట్రియాలో ‘ఉగ్ర’కాల్పులు

వియన్నా: ఆస్ట్రియాలో ఉగ్రవాదులు బీభత్సాన్ని సృష్టించారు. రాజధాని వియన్నాలోని కనీసం ఆరు వేర్వేరు ప్రాంతాల్లో విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డారు. ఇందులో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోగా, సుమారు 17 మంది గాయాలపాలయ్యారు. పోలీసుల కాల్పుల్లో ఓ ముష్కరుడూ హతమయ్యాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారని దేశ ఇంటీరియర్ మినిస్టర్ కార్ల్ నెహమర్ తెలిపారు. మారణాయుధాలు కలిగి నకిలీ ఆత్మాహుతీ సూట్ ధరించిన ముష్కరుడిని పోలీసులు మట్టుబెట్టారని, ప్రాథమిక విచారణలో ఆ ఉగ్రవాది ఐఎస్ఐఎస్‌ సానుభూతిపరుడని తేలినట్టు […]

Update: 2020-11-03 06:04 GMT

వియన్నా: ఆస్ట్రియాలో ఉగ్రవాదులు బీభత్సాన్ని సృష్టించారు. రాజధాని వియన్నాలోని కనీసం ఆరు వేర్వేరు ప్రాంతాల్లో విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డారు. ఇందులో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోగా, సుమారు 17 మంది గాయాలపాలయ్యారు. పోలీసుల కాల్పుల్లో ఓ ముష్కరుడూ హతమయ్యాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారని దేశ ఇంటీరియర్ మినిస్టర్ కార్ల్ నెహమర్ తెలిపారు.

మారణాయుధాలు కలిగి నకిలీ ఆత్మాహుతీ సూట్ ధరించిన ముష్కరుడిని పోలీసులు మట్టుబెట్టారని, ప్రాథమిక విచారణలో ఆ ఉగ్రవాది ఐఎస్ఐఎస్‌ సానుభూతిపరుడని తేలినట్టు వెల్లడించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ మరికొన్ని గంటల్లో అమల్లోకి రాబోతున్న తరుణంలో సోమవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో(స్థానిక కాలమాణం) ఈ దారుణానికి తీవ్రవాదులు ఒడిగట్టారు. లాక్‌డౌన్‌కు ముందు బయట గడిపేందుకు వచ్చిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు కాల్పులు జరిపారు.

ఆరు వేర్వేరు చోట్ల ఈ కాల్పులు నమోదవ్వడంతో వెంటనే సుమారు వెయ్యి మంది పోలీసు బలగాలు రంగంలోకి దిగి గాలింపులు మొదలుపెట్టాయి. ఈ కాల్పులకు తెగబడింది ఒక్కడేనా? లేక మరికొందరు తీవ్రవాదులున్నారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాబట్టి, ఇతర ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు. మంగళవారం ప్రజలు బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితమవ్వాలని సర్కారు ఆదేశించింది. పిల్లలూ పాఠశాలలకు వెళ్లొద్దని సూచించింది. టెర్రరిస్టులు పరారీలో ఉన్నారన్న సందేహంతో ఆస్ట్రియాలోని భారతీయులూ జాగ్రత్తగా మెదులుకోవాలని భారత ఎంబస్సీ సూచించింది.

ఆస్ట్రియాలో ఉగ్రఘటనపై పలుదేశాధినేతలు విస్మయాన్ని ప్రకటించారు. తాము అండగా నిలుస్తున్నట్టు భరోసానిచ్చారు. ‘వియన్నాలో ఉగ్రఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ విషాద పరిస్థితుల్లో ఆస్ట్రియాకు భారత్ అండగా నిలుస్తుంది. బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, స్వీడన్ పీఎం స్టెఫాన్ లోవెన్‌లు సహా పలుదేశాల అధినేతలు ఆస్ట్రియాకు అండగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags:    

Similar News