ఛలో రాజ్‌భవన్‌పై టెన్షన్ టెన్షన్..
దిశ, తెలంగాణ బ్యూరో : పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో టెన్షన్వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన కార్యక్రమం విజయవంతం కావడంతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. ఇదే ఊపుతో ఛలో రాజ్‌భవన్‌ను నిర్వహించాలని టీపీసీసీ చూస్తోంది. అయితే, ఛలో రాజ్‌భవన్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. టీపీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ రాసిన లేఖను పోలీసులు […]
దిశ, తెలంగాణ బ్యూరో : పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో టెన్షన్వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన కార్యక్రమం విజయవంతం కావడంతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. ఇదే ఊపుతో ఛలో రాజ్‌భవన్‌ను నిర్వహించాలని టీపీసీసీ చూస్తోంది. అయితే, ఛలో రాజ్‌భవన్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. టీపీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ రాసిన లేఖను పోలీసులు తిరస్కరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు కూడా లిఖితపూర్వకంగా సమాచారమిచ్చారు. శాంతి భద్రతల కారణంగా అనుమతివ్వలేమని పోలీసులు పేర్కొన్నారు. ఇందిరాపార్క్ దగ్గర కేవలం 2 మైక్‌లతో సభకు అనుమతి ఉందని పేర్కొన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఎన్ని జైళ్లలో పెడుతారో చూస్తాం..
పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామని, గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ధరల పెంపుపై పార్లమెంట్‌ను కూడా స్తంభింపజేస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నిర్బంధించాలని చూస్తే పోలీస్‌స్టేషన్లను ముట్టడిస్తామని, ఎన్ని జైళ్లలో, ఎన్ని స్టేషన్‌లలో పెడతారో చూస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కలిసి రూ. 35 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
పెట్రోల్ వాస్తవ ధర రూ. 40 మాత్రమేనని, అదనంగా కేసీఆర్ ప్రభుత్వం రూ. 32, మోడీ ప్రభుత్వం రూ. 33 చొప్పున వసూలు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ధనవంతులు తిరిగే విమానాల్లో కేవలం ఒక్క రూపాయి వసూలు చేస్తున్న కేంద్రం పేదలపై మాత్రం రూ. 32 వసూలు చేస్తున్నదని ఆరోపించారు. ధనవంతులకు మినహాయింపు ఇచ్చి పేదలపై మాత్రం భారం మోపుతున్నారన్నారు. నగరంలోని ధర్నా చౌక్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్‌కు శుక్రవారం వినతిపత్రం ఇస్తామని ప్రకటించారు.
ఉద్యోగ ఖాళీలపై మోసం
రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలపై సీఎం కేసీఆర్ మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఖాళీలెన్నో తేల్చాలని తాజాగా చేస్తోన్న హడావుడి మరో మోసానికి మాస్టర్ ప్లాన్‌లా ఉందని, 2020 డిసెంబర్‌లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు అధికారికంగా స్పష్టమైందన్నారు. ఆ నివేదిక ఉండగా కొత్తగా లెక్కలు తేల్చేదేంటని, వాస్తవంగా 1.91 లక్షల ఖాళీలు ఉండగా.. 56 వేలు దాటడం లేదన్నట్టు దొంగ లెక్కలు ఎందుకని ప్రశ్నించారు. వివిధ కార్పొరేషన్లలో ఖాళీల సంఖ్య లెక్క తీయాలని.. అన్నింటి పైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్థిక వృద్ధి కంటే కరోనా వృద్ధే ఎక్కువ : దీపేందర్ హుడా
ప్రధాని మోడీ హయాంలో దేశం ఆర్థికంగా అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా కరోనా వృద్ధి మాత్రం భేషుగ్గా ఉందని, ఏక కాలంలో ప్రజలు పన్నుల భారంతో, వైద్య ఖర్చుతో ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దీపేందర్ హూడా వ్యాఖ్యానించారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాభ పడుతున్నాయని, సామాన్యులు జీవితాలు ప్రశ్నార్థకమవుతున్నాయన్నారు. గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు అధోగతిలో పడుతున్నాయని, కేవలం పెట్రోల్ ట్యాక్సుల ద్వారానే కేంద్ర ప్రభుత్వం ఏటా నాలుగు లక్షల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నదన్నారు.
అత్యధిక వ్యాట్ (పెట్రో) పన్నుల్లో తెలంగాణ మూడవ స్థానంలో ఉన్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తున్న ప్రకటనలు కాగితాలకు మాత్రమే పరిమితమైందని, కానీ ప్రజల నుంచి రకరకాల పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయల భారాన్ని మోపుతున్నదన్నారు. ముడిచమురు ధరలు తగ్గినా భారీ ఎక్సైజ్ పన్నులతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. కేంద్రం ‘మేక్ ఇన్ ఇండియా‘ నినాదానికి మాత్రమే పరిమితమైందని, విదేశీ దిగుమతులు భారీగా పెరుగుతున్నాయన్నారు. వంట గ్యాస్ విషయంలో నామమాత్రపు సబ్సిడీ ఇస్తూ చేతులు దులుపుకున్నదని కేంద్రంపై నిప్పులు చెరిగారు.
మధుయాష్కి నివాసానికి కాంగ్రెస్ నేతలు
రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ నేత దీపేందర్‌సింగ్ హుడా.. మాజీ ఎంపీ మధుయాష్కి నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న హుడా.. మధుయాష్కి దగ్గరకు వెళ్లి చర్చించారు. పార్లమెంట్‌లో గతంలో వీర్దిద్దరూ మిత్రులు కావడంతో ఈ భేటీ అని కాంగ్రెస్‌నేతలు చెప్పారు.
కొండాతో భేటీ..
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో దీపేందర్‌సింగ్ హుడా భేటీ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కితో కలిసి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. పార్టీలో చేరే అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు.