అమరావతిలో టెన్షన్..టెన్షన్.. కొత్త వారికి నో ఎంట్రీ

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ఆదివారం నాటికి 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నిరసనలకు పిలుపునిచ్చింది. న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు మహానిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. రోజు వారీ శిబిరంలో కూర్చుని ఆందోళనలు చేసుకోవచ్చని కానీ అంతకుమించి ఆందోళనలు చేస్తే అరెస్ట్‌లు చేస్తామని పోలీసులు […]

Update: 2021-08-08 04:45 GMT
అమరావతిలో టెన్షన్..టెన్షన్.. కొత్త వారికి నో ఎంట్రీ
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ఆదివారం నాటికి 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నిరసనలకు పిలుపునిచ్చింది. న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు మహానిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. రోజు వారీ శిబిరంలో కూర్చుని ఆందోళనలు చేసుకోవచ్చని కానీ అంతకుమించి ఆందోళనలు చేస్తే అరెస్ట్‌లు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో అనుమతులు ఇవ్వడం లేదని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేకాదు 29 గ్రామాల్లో 3వేల మంది పోలీసులను పోలీస్ శాఖ రంగంలోకి దించింది. అయినప్పటికీ రాజధాని ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. దీంతో రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకుంది. మరోవైపు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆలయం చుట్టూ ఇనుప కంచెను వేశారు.

మందడం, వెంకటపాలెంలో టెన్షన్ టెన్షన్…

అమరావతి ఐక్య కార్యచరణ సమితి పిలుపు మేరకు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో మహార్యాలీకి వెంకటపాలెం, మందడం రైతులు సన్నద్దమయ్యారు. వెంకటపాలెంలో మహిళలు, రైతులు హైకోర్టు వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కంచె వేసి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో మహిళలు మరో మార్గం వైపు పరుగులు తీశారు. అక్కడా సైతం పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువురు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు మందడంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మహిళలు, రైతులు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రాజేంద్ర అనే రైతు కాలు విరిగిపోయింది. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కితగ్గకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే అనంతవరంలోనూ మహిళలు రోడ్లపైకి వచ్చారు. హైకోర్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపైనే పోలీసులు బైఠాయించారు. అయితే పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ 15 మంది మహిళా రైతులు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

తూళ్లూరు శిబిరం వద్ద ఉద్రిక్తత

అమరావతి ఐకాస పిలుపు మేరకు హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు భారీగా రైతులు, మహిళలు తూళ్లూరు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. అయితే బైక్ ర్యాలీ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని రైతులు పోలీసులను నిలదీశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురును అరెస్ట్ చేశారు. పోలీసు జీపులలో వారిని తరలించారు. మరోవైపు శిబిరం వద్ద ఉన్న మహిళలు హైకోర్టువైపు పరుగులు తీశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు పరుగులుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజధానిలోకి కొత్తవారికి నో ఎంట్రీ

మహానిరసన ర్యాలీ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా కరకట్టపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కొత్త వారిని లోపలికి అనుమతించడం లేదు. మరోవైపు అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు పలుచోట్ల నిరసనలకు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిలో పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని పెదకూరపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News