శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
దిశ, ఏపీ బ్యూరో: భక్తులు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా శ్రీవారి కటాక్షం పొందేందుకు పది రోజులపాటు అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. పేద భక్తుల వివాహాలు తలకు మించిన భారం కాకుండా ఉండేందుకు కల్యాణమస్తు సామూహిక వివాహ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీకి దేశ వ్యాప్తంగా భక్తులు ఇచ్చిన కానుకలు, ఆస్తులపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. […]
దిశ, ఏపీ బ్యూరో: భక్తులు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా శ్రీవారి కటాక్షం పొందేందుకు పది రోజులపాటు అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. పేద భక్తుల వివాహాలు తలకు మించిన భారం కాకుండా ఉండేందుకు కల్యాణమస్తు సామూహిక వివాహ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీకి దేశ వ్యాప్తంగా భక్తులు ఇచ్చిన కానుకలు, ఆస్తులపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాలను చైర్మన్సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
ముఖ్యాంశాలు..
– వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ వైష్ణవ సంప్రదాయం పాటించడం లేదని గుంటూరుకు చెందిన రాఘవన్కె తాళ్లపాక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సూచన మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న 26 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆగమ సలహామండలి సభ్యులతో చర్చించిన తర్వాత తిరుమల ఆలయ వైకుంఠ ద్వారాన్ని పదిరోజుల పాటు తెరచి ఉంచి భక్తులకు దర్శనం కల్పించాలని తీర్మానించారు. డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
– శ్రీవారి భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులను విక్రయించరాదని 28-05-2020న ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు అన్యాక్రాంతమైనవి, నిరుపయోగంగా ఉన్న 1128 ఆస్తులకు సంబంధించి 8088.89 ఎకరాల భూములున్నట్లు శ్వేత పత్రం విడుదల చేశారు. త్వరలో వీటిపై ఓ కమిటీ వేసి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారు.
– తిరుమలలో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి రూ.2 వేలు యూనిఫామ్ అలవెన్స్ మంజూరు. టీటీడీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం అమలు వాయిదా. దీనిపై ఉద్యోగులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి మరిన్ని ఆసుపత్రులను ఈ పథకంలోకి చేర్చడం
– తిరుమల శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారం తలుపులకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయం. నడకదారిలోని గాలిగోపురాలు ఎండకు, వానకు దెబ్బ తిన్నందువల్ల వాటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు
– తిరుమలను పర్యావరణ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో భాగంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల నిషేధం. తిరుమలకు 100 నుంచి 150 ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటునకు సీఎం అంగీకరించారు. దీనిపై మరోసారి సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాయాలని నిర్ణయం. సౌర, పవన విద్యుత్‌సదుపాయం ఏర్పాటునకు ఆమోదం.
– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని సూర్య ప్రభ వాహనానికి 11.766 కిలోల బంగారంతో తాపడం చేయించడానికి అమోదం.
– తిరుమలలో సాధారణ భక్తులు బస చేసే కాటేజీల మరమ్మతులకు రూ.29 కోట్లు మంజూరు.
– కోవిడ్-19 కారణంగా కార్యక్రమాల్లేక ఇబ్బందిపడుతున్న అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులకు రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని నిర్ణయం.
– సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రచారం చేసేందుకు కొత్తగా ఆరు ప్రచార రథాల కొనుగోలుకు ఆమోదం. బోర్డు సభ్యులు ఈ వాహనాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు.
– తిరుపతి ఎస్వీ బాలమందిరంలో విద్యార్థుల సదుపాయం కోసం రూ.10 కోట్లతో అదనపు ఆస్పత్రి బ్లాక్ నిర్మాణానికి ఆమోదం.
– తమిళనాడు ఊలందూరుపేట పట్టణంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి బోర్డు సభ్యులు శ్రీ కుమారగురు 4 ఎకరాల భూమి, రూ.10 కోట్ల నగదు విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. అక్కడ శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం.
– టీటీడీ నగదు డిపాజిట్లను జాతీయ బ్యాంకులు, కొన్ని షెడ్యూల్డ్ బ్యాంకుల్లోనే ఎక్కువ వడ్డీ లభించేలా డిపాజిట్చేయడానికి ఆమోదం.
– సమావేశంలో ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, నిశ్చిత, గోవిందహరి, దామోదర్‌రావు, కుపేందర్‌రెడ్డి, వెంకట ప్రసాద్‌కుమార్, డీపీ.అనంత, కృష్ణమూర్తి వైద్యనాథన్, మురళీకృష్ణ, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు పి.బసంత్‌కుమార్, సదా భార్గవి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.