యువతి సూసైడ్.. సంచలన వివాదంలో టీఆర్ఎస్ నేత
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని టీఆర్ఎస్ యూత్ మండల ప్రధాన కార్యదర్శి మోసం చేశాడని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
దిశ మరిపెడ/ దంతాలపల్లి : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని టీఆర్ఎస్ యూత్ మండల ప్రధాన కార్యదర్శి మోసం చేశాడని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన పోలేపల్లి శరణ్య మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణం టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రధాన కార్యదర్శి కొండా లింగమల్లు(23)గా సూసైడ్‌లో నోట్‌లో పేర్కొంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో లింగమల్లు ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెబుతున్నారు.
కొద్దిరోజుల క్రితమే పంచాయితీ..
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన శరణ్య, యాదవ కులానికి చెందిన లింగమల్లు కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలని ఇటీవల లింగమల్లును శరణ్య నిలదీసింది. చివరకు లింగమల్లు పెళ్లికి నిరాకరించాడు. పెద్ద మనుషుల సమక్షంలో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. కొంత పరిహారంగా నగదు ఇచ్చేందుకు ముందుకు రాగా బాధితురాలి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. నాటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న శరణ్య మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.