Yanamala Rama Krishnudu: స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామంటూ నిధులు లాక్కుంటున్నారు: యనమల

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై - Yanamala Ramakrishna made harsh remarks against the YSR Congress government

Update: 2022-04-07 11:04 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైసీపీ ప్రభుత్వంలో ఒక మిధ్యేనంటూ చెప్పుకొచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ జపం చేస్తున్న జగన్ రెడ్డి అభివృద్ధిపై ఖర్చు పెట్టాడో చెప్పగలడా? అంటూ ప్రశ్నించారు. 'స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామంటూ 14, 15 వ ఆర్థిక సంఘం నిధులు రూ.7,500 కోట్లు లాక్కున్నారు. పంచాయతీల సాధారణ నిధులు రూ. 3,500 కోట్లు మళ్లించుకున్నారు. రాజ్యాంగంలో 73, 74 వ రాజ్యాంగ సవరణలతో ఏర్పాటు చేసిన ఆర్టికల్ 243 G, 243 W లను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తుంగలో తొక్కారు. వైసీపీ ప్రభుత్వం 11, 12 వ షెడ్యూల్స్‌లో ప్రస్తావించిన అంశాలను కూడా బుట్టదాఖలు చేసింది' అని యనమల ధ్వజమెత్తారు.

73, 74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తి కోసం ఏర్పాటు చేశారనే విషయం జగన్ రెడ్డికి తెలుసని నేను అనుకోవడం లేదు. ఆర్టికల్ 243 (I) గ్రామ పంచాయతీలకు, ఆర్టికల్ 243 (Y) అర్బన్ లోకల్ బాడీలకు ఆర్ధిక సంఘం నిధులు కేటాయించాలని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ప్రజలపై చెత్త పన్ను వేసి వారిపై మోయలేని భారాలు వేయడం తప్ప వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు చేసిందేమి లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలను, వాటి ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అపహాస్యం చేసింది. స్థానిక సంస్థలలో బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నాయకత్వం ఎదగకుండా జగన్ రెడ్డి రాజకీయ అడ్డంకులు సృష్టిస్తున్నారు అని యనమల విరుచుకుపడ్డారు.

క్యాపిటల్ వ్యయం చేయనప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటి?

'అభివృద్ధి వికేంద్రీకరణ పై మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డి కి లేదు. అభివృద్ధి అంటే మూలధన వ్యయం చేయడం. జగన్ రెడ్డి మూడేళ్లలో క్యాపిటల్ వ్యయం పై రూ. 20 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. క్యాపిటల్ వ్యయం చేయనప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని ఏ విధంగా చెబుతుంది? బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు నివసించే ప్రాంతాలలో మౌళిక సదుపాయాల కల్పనకు కేటాయించిన వేల కోట్ల నిధులు దారి మళ్లించారు.

మూడేళ్లలో ఆ వర్గాల కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయిలోను ఇచ్చిన దాఖలాలు లేవు. స్థానిక సంస్థలకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు వారి హక్కులను, వారి నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ముందుకొచ్చి వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన పై పోరాటం చేయాలి' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News