శాసన సభను హైకోర్టు శాసించడం ఏంటి?

Update: 2022-03-04 13:58 GMT

దిశ, ఏపీ బ్యూరో : 'అసెంబ్లీని హైకోర్టు శాసించడం అభ్యంతరకరంగా ఉంది. రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు న్యాయవ్యవస్థకు లేదు. ఇలాంటి నిర్ణయాలు తిరిగి న్యాయవ్యవస్థను కాటేస్తాయి. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు' అని వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

న్యాయ వ్యవస్థ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందంటూ మండిపడ్డారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని.. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం సైతం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. అలాంటిది శాసనసభకు హక్కులేదని హైకోర్టు ఏ విధంగా చెప్తుందని కోరుముట్ల ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. కోట్లాది మంది ఆశీస్సులతో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగానే రాజధానిని నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తుంటే.. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆరోపించారు.

Tags:    

Similar News