ధర్మపురి బీజేపీ అభ్యర్థిగా వివేక్.. ?
దిశ, ధర్మపురి: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే..Vivek is the BJP candidate from Dharmapuri constituency?
దిశ, ధర్మపురి: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే ధర్మపురి నియోజకవర్గం బీజేపీ అభ్యర్యిగా మాజి ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు వివేక్ వెంకట స్వామి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలు మరో ఏడాది సమయం పట్టనుంది. తెలంగాణలో పాగా వేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్న బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధీటైన అభ్యర్థుల జాబితా తయారు చేసే పనిలో బీజేపీ అధిష్టానం నిమగ్నం అయింది. ఇందులో భాగంగా ధర్మపురి నుండి వివేక్ ను బరిలో నిలిపేందుకు ముఖ్య నాయకత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం. కాగా, ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నుండి ఇప్పటికీ 4 సార్లు గెలుపొందారు. చీఫ్ విప్ గా, క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొప్పులను ఓడించాలంటే బలమైన నాయకుడు అవసరం అని భావిస్తున్నట్టు సమాచారం.
అయితే రిజర్వేషన్ నియోజకవర్గం కూడా అయిన ధర్మపురి నుండి వివేక్ ను బరిలో నిలిపితే సానుకూల ఫలితం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి పార్టీ వర్గాల్లో. ఇక్కడి నుండి పోటీ చేస్తున్న వారిలో సిట్టింగ్ అయిన కొప్పుల, కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు బలమైన అభ్యర్థులే. 2018 ఎన్నికల్లో అడ్లూరి 411 ఓట్లతో మాత్రమే ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు లేకపోలేదు. టీఆర్ఎస్ నుండి మంత్రి కొప్పుల, కాంగ్రెస్ నుండి అడ్లూరిలు బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇద్దరు హేమా హేమీలకు ధీటుగా అన్ని విధాలుగా గట్టి పోటీ ఇచ్చే విదంగా బీజేపీ అభ్యర్థి ఉండాలనే ఉద్దేశ్యంతో వివేక్ ను బరిలో దించేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ధర్మపురిలో చర్చలు సాగుతున్నాయి.
కాగా వివేక్ ధర్మపురి నియోజక వర్గం ప్రజలకు సుపరిచితుడే. గతంలో పెద్దపల్లి ఎంపీగా వివేక్ గెలుపొందారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే ధర్మపురి నియోజక వర్గం ఉండడంతో వివేక్ కు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. తనకంటూ ప్రత్యేకంగా క్యాడర్ కూడా ఉండడం ఆయనకు మరింత లాభించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నుండి వివేక్ బరిలో ఉంటే ధర్మపురిలో త్రిముఖ పోటీ తప్పదు. కాగా వివేక్, కొప్పుల ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాగా అడ్లూరి మాత్రం ఎస్సీ ఉపకులాల్లో మరో సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పటికే కొప్పుల నియోజక వర్గంలో వివిధ అభివృద్ధి, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజకు దగ్గరయ్యే విదంగా పావులు కలుపుతుండగా, అడ్లూరి గ్రామాల్లో ప్రజలను కలుస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల ముందుకు వెళ్తున్నారు. వివేక్ కూడా ఇదే స్థాయిలో నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకునేందుకు వివేక్ పెద్దపల్లిలోని 7 సెగ్మెంట్లలో పర్యటిస్తున్నారు. ఇందులో ధర్మపురిపై ప్రత్యేక దృష్టిసారించారని అంటున్నారు. అయితే ఇటీవల ధర్మపురిలో వివేక్ పర్యటించినప్పుడు శాసనసభలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారా అని కొంతమంది అడుగగా సానుకూలంగా మాత్రం స్పందించలేదు. అయితే బీజేపీ మొదటి విడతగా రాష్ట్రంలోని రిజర్వేషన్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివేక్ ను ఇక్కడి నుండి పోటీ చేయిస్తే గట్టిపోటీనిచ్చి గెలిచే అవకాశాలు కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులు అంటున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తరువాత కానీ వివేక్ ఎటువైపు మొగ్గు చూపుతారోనన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.