'వైసీపీ ఎన్నికలకు వెళ్తే 20 సీట్లు కూడా రావు'
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - Vishnu Kumar Raju has made sensational remarks that if he goes to the YCP elections, he will not get even 20 seats
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే వైసీపీ 20 స్థానాల్లో కూడా గెలుపొందలేదంటూ బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పాలన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ఇంత చెత్త ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. వైసీపీ లాంటి నియంతృత్వ పాలన కూడా దేశంలో ఎక్కడ లేదని చెప్పుకొచ్చారు. గతంలో విద్యుత్ చార్జీలపై బాదుడే.. బాదుడే అంటూ స్లొగన్స్ ఇచ్చిన జగన్ ఇప్పుడెందుకు చార్జీలు పెంచుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో బాదుడే బాదుడు అన్న జగన్ ఇప్పుడు ప్రజలకు వాతలే.. వాతలు అంటారా అంటూ సెటైర్లు వేశారు.
జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు ఉగాది కానుక ఇచ్చారని.. మరో రెండేళ్లలో జగన్‌ను ఇంటికి పంపించి ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని ఎద్దేవా చేశారు. అంతేకాదు సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తే.. కనీసం 20 సీట్లు కూడా రావని చెప్పుకొచ్చారు. వైఎస్ షర్మిళ, వైఎస్ విజయమ్మ పాదయాత్ర, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు కావడం వల్లే జగన్ ముఖ్యమంత్రి కాగలిగారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ చెత్త ముఖ్యమంత్రి..
రాష్ట్రం లో అధికారుల తీరుపై విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అంత లొంగిపని చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ అధికారంలో ఉండేది ఇంకా రెండేళ్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. 8 మంది ఐఏఎస్‌లను న్యాయమూర్తి కనికరించి వదిలేశారు కాబట్టి సరిపోయిందని లేకపోతే జైలుకు వెళ్లాల్సిందే అని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు. జగన్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని చెప్పుకొచ్చారు.
అయితే ఇల్లు, రేషన్ కార్డు, పథకాలు ఎక్కడ కట్ చేస్తారోనన్న భయంతో ప్రజలు తమ అభిప్రాయాలు బయటకు చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. తాను కూడా మెడలో కండువా లేకపోతే.. జగన్ గెలుస్తాడని చెబుతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ కండువా తమకు శ్రీరామరక్ష అని.. లేదంటే నాకు కూడా పోలీసులతో కుమ్ముడే కుమ్ముడు అంటూ సెటైర్లు వేశారు.
ఈ సందర్భంగా గతంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన చెత్త ముఖ్యమంత్రి అన్న వ్యాఖ్యలను సమర్థించారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు.