ఆకాశం నుంచి వింత వస్తువులు.. ఏలియన్స్ పంపిన సంకేతాలా?

దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో ఆకాశం నుంచి గుర్తు తెలియని..telugu latest news

Update: 2022-04-05 11:12 GMT

దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో ఆకాశం నుంచి గుర్తు తెలియని వస్తువులు నేలపై పడుతున్న సంఘటనలు అనేకచోట్ల నమోదయ్యాయి. అవి ఎక్కడ నుంచి రాలిపడుతున్నాయన్న విషయంలో స్పష్టత లేకపోగా.. తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోనూ ఇలాంటి వస్తువులే ఆకాశం నుంచి కింద పడ్డాయి. అవి ఇప్పటికీ వేడిగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంతకీ ఈ వస్తువులు అంతరిక్ష కేంద్రం నుంచి రాలిపడ్డ ఉపగ్రహ శిథిలాలా? లేక ఏలియన్స్ భూమిపైకి ఏవైనా సిగ్నల్స్ పంపుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మహారాష్ట్ర, చంద్రాపూర్ జిల్లా, సిందేవాహి తహసీల్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక భూభాగంలో ఒక మెటల్ రింగ్, సిలిండర్ వంటి వస్తువులు కనిపించడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. ఇవి గ్రహాంతరవాసుల నుంచే రావచ్చని కొందరు భావిస్తుండగా.. అంతరిక్ష శిథిలాలు కూడా అయ్యుండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సంఘటన పై చంద్రాపూర్ జిల్లా కలెక్టర్, అజయ్ గుల్హానే వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉల్కాపాతం వంటి కాంతి కిరణాలు ఆకాశంలో కనిపించాయని.. రాత్రి 7.50 గంటలకు సింధేవాహి తహసీల్‌, లడ్‌బోరి గ్రామంలోని బహిరంగా ప్రదేశంలో పడిన 3 మీటర్ల రింగ్‌ను గ్రామస్తులు గుర్తించారని తెలిపారు. మరో గ్రామంలో ఆదివారం ఉదయం గోళాకార వస్తువును కనుగొన్నట్లు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వస్తువులు ఉపగ్రహ ప్రయోగం తర్వాత పడిపోయే రాకెట్ బూస్టర్ల ముక్కల నుంచి భూవాతవరణంలోకి ప్రవేశించే ఉల్కలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.



Tags:    

Similar News