హెలికాప్టర్ నిర్మించి.. యూరప్ చుట్టేసిన కేరళ మ్యాన్!

దిశ, ఫీచర్స్ : మహమ్మారి సమయంలో లాక్‌డౌన్స్ కారణంగా ఎంతోమంది తమ ఇన్నోవేషన్, సృజనాత్మకతతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Update: 2022-07-30 16:06 GMT

దిశ, ఫీచర్స్ : మహమ్మారి సమయంలో లాక్‌డౌన్స్ కారణంగా ఎంతోమంది తమ ఇన్నోవేషన్, సృజనాత్మకతతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పరిస్థితులు ఎలా ఉన్నా.. నూతన సాంకేతికతతో కొత్తతరహా ఆవిష్కరణ చేయడం సులువేనని నిరూపించిన ఈ తరంలో కేరళకు చెందిన ఆటోమొబైల్ ఇంజనీర్ అశోక్ అలిషెరిల్ థమరాక్షన్ ఒకరు. ఈ సమయంలో ఏకంగా ఓ హెలికాప్టర్‌నే రూపొందించిన అశోక్.. అందులోనే ఫ్యామిలీతో యూరప్‌‌ను చుట్టేసి నెటిజన్ల మనసు దోచుకున్నారు.

యూకే, ఎసెక్స్‌లోని బిల్లెరికేలో నివసిస్తున్న థమరాక్షన్.. కేవలం రూ. 1.14 కోట్ల(1,40,000 యూరోలు) వ్యయంతో 1,500 గంటల్లో నాలుగు-సీట్ల ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్ స్లింగ్ టీఎస్‌ఐని నిర్మించాడు. విమానం బరువు 520కిలోలు కాగా 950 కిలోలు మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం.​నలుగురు ప్రయాణించగలిగే ఈ విమానం గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించగలదు. తన కుమార్తె దియా(G అనేది దేశం కోడ్) పేరు మీదుగా ఆ విమానానికి G-Diya అని పేరు పెట్టగా ఇది ఒకే ఇంజన్‌పై పనిచేస్తుంది. రెండేళ్ల నుంచి డబ్బు ఆదా చేస్తూ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసిన థమరాక్షన్‌కు ఇదివరకే పైలట్ లైసెన్స్ ఉంది. కాగా తన షెడ్‌లోనే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ నిర్మాణం పూర్తి చేశాడు. కేరళకు చెందిన ఆర్‌ఎస్‌పీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎవీ థమరాక్షన్ కుమారుడైన అశోక్ 2006లో పాలక్కాడ్‌లోని ఎన్‌ఎస్‌ఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఫోర్డ్‌లో ఉద్యోగం పొందాడు. ఆ కంపెనీ తరఫునే తను యూకేకు వెళ్లాడు.

విమానానికి అనుమతి పొందిన తర్వాత.. అశోక్, అతని ఇద్దరు స్నేహితులతో కలిసి ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్‌ను సందర్శించారు. ఇక ఈ విమానం ఇప్పటివరకు 86 గంటల ప్రయాణాన్ని నమోదు చేసింది. వచ్చే నెలలోపు యూకేకి తిరిగొచ్చిన తర్వాత మరిన్ని ట్రిప్స్ ప్లాన్ చేయనున్నట్లు అశోక్ తెలిపారు. అశోక్ భార్య అభిలాషా దూబే ఇండోర్‌కు చెందిన వ్యక్తి కాగా.. ఆమె యూకేలో ఇన్సూరెన్స్ డేటా ఎనలిస్ట్‌గా వర్క్ చేస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. యూకే సహా ఇతర దేశాల్లో విమానాల నిర్మాణానికి చట్టపరమైన చిక్కులు అంతగా ఉండకపోవడంతో ఇది సాధ్యమైందని.. ఎయిర్‌క్రాఫ్ట్ రూపొందించడం ఆటోమొబైల్‌ను తయారు చేయడం లాంటిదేనని అభిలాష అన్నారు.

చిన్నప్పటి నుంచి విమానాలు ఆకర్షించేవి, యూకేలో స్థిరపడ్డాక విమానం కొనాలనుకున్నాను. ఆ ఇష్టంతోనే 2018లో పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత రెండు సీట్ల విమానాలను అద్దెకు తీసుకుని చక్కర్లు కొట్టేవాడిని. అయితే నా కుటుంబాన్ని వెంట తీసుకెళ్లేందుకు నాలుగు సీట్ల విమానం అవసరం కాగా.. లాక్‌డౌన్ సమయం దానిపై పరిశోధించేందుకు నన్ను ప్రోత్సహించింది. ఈ క్రమంలోనే విమాన తయారీకి దాదాపు రూ. 5 నుంచి 6 కోట్ల వరకు ఖర్చవుతుందని అర్థమైంది. అయితే యూకే సహా ఇతర దేశాల్లో చాలా మంది వ్యక్తులు అందుబాటులో ఉన్న విడిభాగాలతో చిన్న విమానాలను నిర్మిస్తున్నారని తెలుసుకుని దక్షిణాఫ్రికా నుంచి విడిభాగాలను, ఆస్ట్రియా నుంచి ఇంజిన్‌ను, అమెరికా నుంచి ఏవియానిక్స్ పరికరాలను కొనుగోలు చేశాను. మా ఇంటి సమీపంలోనే వర్క్‌షాప్ ఏర్పాటు చేసి, ఎయిర్ క్రాఫ్ట్ రూపొందించే పనులు మొదలుపెట్టాను. యూకే ఏవియేషన్ అథారిటీ నా పనిని పర్యవేక్షించగా,, ప్రతీ విభాగానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ చెకింగ్ పూర్తయ్యి ఆమోదం పొందిన తర్వాతే నిర్వహించబడింది. అథారిటీ అధికారులు మూడు నెలల పాటు నిరంతరంగా విమానంలో ఫ్లయింగ్ టెస్ట్‌లు నిర్వహించిన తర్వాత చివరకు ఫిబ్రవరిలో ప్రయాణించేందుకు అంగీకరించారు.

- అశోక్ థమరాక్షన్

Tags:    

Similar News