వైఎస్ వివేకా హత్య కేసులో ఇద్దరు బడా నేతలు: డీఎల్ రవీంద్రారెడ్డి
దిశ, ఏపీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి latest telugu news..
దిశ, ఏపీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య కేసులో సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందని వెల్లడించారు. ఇప్పటికే సీబీఐ విచారణ పై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్ణయాన్ని తప్పుబట్టేలా మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఇద్దరు పెద్దల హస్తం ఉందని ప్రచారం జరుగుతుందని.. ఈ ప్రచారం పై సీబీఐ నిగ్గు తేల్చాలని కోరారు. అలాగే పులివెందులలో వైసీపీ నేతల ప్రమేయం పై కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని వాటిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ నేతల ప్రమేయం తో పాటు ఈ కేసులో నిందితుల గుట్టు రట్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కేసు నుంచి వైసీపీ నేతలపై వస్తున్న ఆరోపణలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నించడం సరికాదన్నారు. అంతేకాదు బాధితులపైనే నేరాన్ని మోపేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది చాలా దుర్మార్గమని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. తండ్రి పోయి ఎవరు చంపారో తెలియని స్థితిలో వైయస్ సునీతారెడ్డి ఉందని.. న్యాయస్థానాల్లో పోరాడి సీబీఐ విచారణ జరిగేలా చేసిందని గుర్తు చేశారు. ఈ హత్య కేసులో వైఎస్ సునీత ప్రమేయం ఉందని సజ్జల ఆరోపించడాన్ని ఖండించారు. ఈ హత్య కేసులో వైయస్ సునీతారెడ్డి ప్రమేయం లేదని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయి దారుణ హత్యకు గురైతే సాయంత్రానికి జగన్ రావడంపై ప్రశ్నించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నించే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వివేకా హత్య కేసులో నిందితులు ఎవరూ తప్పించుకోలేరని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి హెచ్చరించారు.