ప్రీమియం విభాగంలో 'రోనిన్ ' బైకును విడుదల చేసిన టీవీఎస్ మోటార్స్!
న్యూఢిల్లీ: భారత ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రీమియం బైకుల విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది.
న్యూఢిల్లీ: భారత ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రీమియం బైకుల విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో పట్టు సాధించేందుకు తన కొత్త మోడల్ 'రోనిన్ ' బైకును మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలుగా నిర్ణయించామని, దీని టాప్ వేరియంట్ ధర రూ. 1.68 లక్షల వద్ద ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత ప్రీమియం బైకుల మార్కెట్ 15 లక్షల వాటాతో వేగంగా పెరుగుతోంది. దేశీయ వినియోగదారులు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా 200-250సీసీ బైకులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఈ క్రమంలోనే వినియోగదారులకు ప్రీమియం బైకులను అందించే లక్ష్యంతో రోనిన్ మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది. ఇది టీవీఎస్ నుంచి వచ్చిన తొలి రెట్రో స్క్రాంబ్లర్ బైక్. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్‌తో వచ్చిన మొదటి ద్విచక్ర వాహనం ఇదేనని టీవీఎస్ వెల్లడించింది. రోనిన్ ద్వారా రానున్న సంవత్సరాల్లో కంపెనీ మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకుంటుందని కంపెనీ సీఈఓ కె ఎన్ రాధాకృష్ణన్ చెప్పారు. రోనిన్ బైక్ 225.9సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ స్క్వేర్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. మొత్తం ఆరు రంగుల్లో ఒక్కో వేరియంట్ రెండు రంగుల్లో లభిస్తుంది. అలాగే, సింగిల్-ఛానల్ ఏబీఎఎస్, రియర్ వ్యూ మిర్రర్స్, మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ సహా పలు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.