త్వరలో మడికొండలో కాకతీయ టెక్స్ టైల్ పార్కు
త్వరలోనే మడికొండ కాకతీయ టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలోనే మడికొండ కాకతీయ టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. పరిశ్రమల యూనిట్లు ఉత్పత్తులు ప్రారంభించి వాటిని మార్కెటింగ్ చేసుకునేందుకు అవసరమైన అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, యూనిట్లను ఏర్పాటు చేసుకున్న వారికి బ్యాంకు రుణాలందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా మడికొండ కాకతీయ టెక్స్‌టైల్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రతినిధి బృందం బుధవారం పరిశ్రమ భవన్‌లో టీఎస్ ఐఐసీ చైర్మన్ ను కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. మడికొండలో 60 ఎకరాలలో నెలకొల్సిన టెక్స్ టైల్ పార్కులో ప్రహరీ, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, నీటి వసతి ఇతర మౌలిక సదుపాయాలను టీఎస్ ఐఐసీ యంత్రాంగం కల్పించిందన్నారు. టెక్స్ టైల్ పార్కులో స్థలాలను పొందిన 364 మంది సభ్యులతో కో-ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకోగా, ఇప్పటివరకు 160 మందికి బ్యాంకు రుణాలు మంజూరు కాగా, వారు షెడ్లను, మిషన్లను ఏర్పాటు అమర్చుకుని ప్రయోగాత్మకంగా ఉత్పత్తులను ప్రారంభించి మార్కెటింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని వివరించారు. సొసైటీ సభ్యులందరికీ బ్యాంకు రుణాలందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై టీఎస్ ఐఐసీ చైర్మన్ స్పందిస్తూ.. మడికొండ టెక్స్ టైల్ పార్కులో త్వరితగతిన మౌలిక సదుపాయాలను కల్పించి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి సొసైటీ సభ్యులందరికీ రుణాలందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండికొండ కాకతీయ టెక్స్ టైల్ వీవర్స్ కో-అపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు దర్గ స్వామి, ఉపాధ్యక్షులు అయిలయ్య, వీరన్న, కార్యదర్శి రవీందర్‌రావు, వెంకటేశ్వర్లు, ఎం.రాజు, ఇ ఉపేందర్‌రెడ్డి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.