అక్రమార్కులకు అధికారుల అండ.. వారికి అన్నీ తెలిసిన గప్ చుప్..!
దిశ, ఎల్బీనగర్: అక్రమ నిర్మాణాలను అరికట్టడంతో పాటు, వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని-latest Telugu news
కొందరు అవినీతి అధికారుల చేతివాటం.. అక్రమార్కులకు వరంగా మారుతోంది. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న అధికారులు.. అవినీతి మత్తులో తూగుతూ.. అక్రమార్కులతో అంటకాగుతున్నారు. హయత్‌నగర్ సర్కిల్-3 పరిధిలోని మన్సూరాబాద్, నాగోల్ డివిజన్ పరిధిలో ఈ ఘటనలు కోకొల్లలు. అయినప్పటికీ.. అధికారులు మీనమేషాలు లేక్కిస్తూ కాలం వెల్లదీస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దిశ, ఎల్బీనగర్: అక్రమ నిర్మాణాలను అరికట్టడంతో పాటు, వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీపాస్‌కు హయత్‌నగర్ సర్కిల్ -3 డిప్యూటీ సిటీ ప్లానింగ్ అధికారిని (డీసీపీ), స్పెషల్, నోడల్ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. కళ్ల ముందే టీఎస్ బీపాస్‌కు విరుద్ధంగా అక్రమ బహుళ అంతస్తులు వెలుస్తున్నప్పటికీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ అక్రమార్కులకు అండ దండలు అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల ఆదేశాలు బేఖాతరు..
హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని మన్సూరాబాద్, నాగోల్ ప్రాంతాలలో ఎటుంవంటి సెట్‌బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఉన్నత అధికారులకు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందడంతో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పక్కన పెట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు ఆక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు చోద్యం చూస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో డిప్యూటీ సిటీ ప్లానర్, స్పెషల్ నోడల్ ఆఫీసర్ సహా చైన్‌మెన్‌లు అందినకాడికి దండుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సర్కిల్ పరిధిలోని మన్సూరాబాద్, నాగోల్ ప్రాంతాలలో మరెన్నో అక్రమ నిర్మాణాలను కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవినీతే కారణమా..?
హయత్‌నగర్ సర్కిల్ -3 లోని మన్సూరాబాద్, నాగోల్ డివిజన్‌లలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటిని అడ్డుకోవాల్సిన డిప్యూటీ సిటీ ప్లానింగ్ అధికారిని (డీసీపీ), స్పెషల్ నోడల్ ఆఫీసర్లు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అక్రమార్కులు యద్ధేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశామనే పేరుతో కాలం వెల్లదీస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.