ఆ డాగ్‌హౌజ్ విలువ రూ. కోటి పైనే.. ఎందుకంత ధర?

దిశ, ఫీచర్స్ : జపాన్‌‌కు చెందిన ‘కల్చరల్ ప్రాపర్టీ స్ట్రక్చరల్ ప్లాన్ కో లిమిటెడ్’ సంస్థ.. సాంస్కృతిక భవనాలు, పురాతన దేవాలయాలను పునరుద్ధరించడంతో పాటు నిర్మిస్తోంది..Latest Telugu News

Update: 2022-06-21 07:52 GMT

దిశ, ఫీచర్స్ : జపాన్‌‌కు చెందిన 'కల్చరల్ ప్రాపర్టీ స్ట్రక్చరల్ ప్లాన్ కో లిమిటెడ్' సంస్థ.. సాంస్కృతిక భవనాలు, పురాతన దేవాలయాలను పునరుద్ధరించడంతో పాటు నిర్మిస్తోంది. ఇందుకోసం శతాబ్దాల నాటి ఆలయ నిర్మాణ పద్ధతులను అనుసరించే సాంప్రదాయ వాస్తుశిల్ప నిపుణులను కలిగివున్న ఈ కంపెనీ తాజాగా 'ఇనుడెన్' పేరుతో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది. జపనీస్ పురాతన కట్టడాలకు అవలంబించిన సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తూ సహజ పదార్థాలతో అధిక-నాణ్యత కలిగిన స్పెషలైజ్డ్ డాగ్ హౌస్‌ నిర్మిస్తోంది. కాగా ప్రత్యేకంగా చేతితో నిర్మించిన ఒక డాగ్ హౌజ్‌ ధర రూ. కోటికి($150,000) పైగా ఉండగా.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన కెనైన్ హోమ్‌గా నిలవనుంది.

పురాతన కట్టడాల నిర్మాణ సాంకేతికతతో డాగ్ హౌస్‌ను సృష్టించి, విక్రయించడమే లక్ష్యంగా 'ఇనుడెన్ ప్రాజెక్ట్' మొదలుపెట్టామని జపాన్ కంపెనీ ఇటీవలే ప్రకటించింది. ఈ మేరకుషీట్ మెటల్ కళాకారులతో జెన్షు-సామా శైలిలో ఇనుడెన్‌ను రూపొందించింది. ఇది చెక్కతో తయారు చేయగా, సాగదీసిన రాగి పలకలతో కూడిన అందమైన పైకప్పు కలిగి ఉంటుంది. ఇక దీని బేస్‌మెంట్‌ను గ్రానైట్‌తో నిర్మించారు. సౌకర్యాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే అంశాలేం లేవు కానీ పాతపద్ధతులతో, అందులోనూ చేతితో నిర్మించడం, ఏడాదికి ఒక్క యూనిట్ మాత్రమే ఉత్పత్తి చేయడం వంటి కారణాలతో ఈ నిర్మాణానికి అధిక ధరను నిర్ణయించారు.

కల్చరల్ ప్రాపర్టీ స్ట్రక్చరల్ ప్లాన్ కో., లిమిటెడ్.. సెప్టెంబర్ 1న ఇనుడెన్ డాగ్ హౌస్ కోసం ఆర్డర్స్ ప్రారంభిస్తుంది. ఒకవేళ ఒకటికి పైగా ఆర్డర్స్ పొందినట్లయితే లాటరీ పద్ధతిలో ఒక్కరికి మాత్రమే ఈ హౌస్‌ను విక్రయించనుంది. ఇవే కాక కోటిన్నర విలువ గల విలాసవంతమైన లిటరల్ డాగ్ మాన్షన్స్ కూడా ఉన్నప్పటికీ నిర్మాణశైలి పరంగా 'ఇనుడెన్‌' ప్రత్యేకమనే చెప్పాలి. 


Similar News