భట్టి వర్సెస్ మంత్రి ఎర్రబెల్లి

బడ్జెట్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు.

Update: 2022-03-09 15:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బడ్జెట్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మొదట 1200కోట్ల నుంచి 10వేలకోట్లకు పెంచి పూర్తి చేయలేదని అన్నారు. వెంటనే మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకొని బయ్యారం, ఐటీఆర్, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ గురించి కాంగ్రెస్ ఎప్పుడైనా మాట్లాడిందా? అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెట్టాలని చూడొద్దు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణపై మాట్లాడటం సిగ్గులేదా? అన్నారు. రాహుల్ గాంధీని తిట్టినా మీకు సోయిలేదని మండిపడ్డారు. సంపద పెరిగిందని బడ్జెట్ లో చూపారు.. ధాన్యాన్ని కొనాల్సిందేనని భట్టి అనడంతో మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకొని కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఛత్తీస్ గఢ్ నుంచి ధాన్యంను తెలంగాణకు తీసుకొస్తున్నారని, అక్కడ 1200 క్వింటా కొనుగోలు చేస్తున్నారని... ములుగులో ధాన్యం లారీలు రాష్ట్రానికి వస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఆ రాష్ట్రంలో గింజకుండా కొనడం లేదన్నారు. దీనికి వెంటనే భట్టి కౌంటర్ ఇచ్చారు. ఛత్తీస్ గఢ్‌లో ఎలా కొనుగోలు చేస్తున్నారో పోదామా? అని సవాల్ చేశారు. అసత్య ప్రకటనలు మానుకోవాలన్నారు.

డబుల్ బెడ్రూంలపై మాటకు మాట

కాంగ్రెస్ పాలనలో పేదవారందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని భట్టి పేర్కొన్నారు. ఇంటిస్థలం ఉంటే రూ.5లక్షల ఇస్తామని రూ.3లక్షల ప్రకటన ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పుడు పెరిగిన ధరలతో రూ.8లక్షల నుంచి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే మంత్రి హరీష్ రావు స్పందించి... ఇళ్ల మంజూరులో దొంగలెక్కలు చూపారని... అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు డబుల్ బెడ్రూంలు ఇచ్చారా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా మండిపడ్డారు. కాంగ్రెస్ ను మాట్లాడకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం కలుగ జేసుకొని కోడిగుడ్డ మీద ఈకలు పీకొద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లను పోల్చొద్దన్నారు.

Tags:    

Similar News