పినపాకపై సీతక్క కొడుకు ఫోకస్.. కొన్నిరోజులుగా నియోజకవర్గంలోనే మాకాం?
దిశ, మణుగూరు: పినపాక నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నియోజకవర్గంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
దిశ, మణుగూరు: పినపాక నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నియోజకవర్గంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. 2023 ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క పోటీ చేస్తుందా..? లేక తన కుమారుడు సూర్యను పోటీలో నిలబెడుతుందా? అనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క 2023లో పినపాక నుంచి పోటీచేస్తే అవలీలగా గెలువడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీతక్క కుమారుడు గతకొన్ని రోజుల నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలు సీతక్క రాక కోసమేనా అని కొంతమంది రాజకీయ ప్రముఖులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేక సీతక్క రాకుండా తన కుమారుడిని పినపాకలో పోటీ చేపిస్తుందా? అనేది కూడా నియోజకవర్గంలో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా తన కూమారుడి ద్వారా నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటుందని ప్రముఖులు చర్చించుకుంటున్నారు.
గతకొన్ని రోజులగా ఇక్కడే మాకాం..
ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య గతకొన్ని రోజులుగా పినపాక నియోజకవర్గంలోనే మకాం వేశాడని సమాచారం. రోజుకో మండలం చొప్పున రాత్రి, పగలు అనే తేడా లేకుండా విస్తృతంగా పర్యటనలు చేస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, నియోజకవర్గంలోని కొన్ని కుటుంబాలకు అండగా ఉంటానని హామీ సైతం ఇచ్చారని సమాచారం. కొన్ని మండలాల ప్రజాలైతే సీతక్క కుమారుడు ఎప్పుడు వస్తాడా? అని గుమ్మంలో ఎదురుచూడటం సంచలనంగా మారింది. మంగళవారం పినపాక మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు అచ్చ నవీన్ నివాసాన్ని సందర్శించి, పలు సమస్యలను అడిగి తెలుకున్నారు. అనంతరం సీతక్క కూమారుడిని అచ్చ నవీన్ సత్కరించారు. విషయం తెలుసుకున్న మండల ప్రజలు సీతక్క కుమారుడిని చూసేందుకు భారీగా తరలివచ్చారు.
పినపాక బరిలో సీతక్కా.. ఆమె కుమారుడా?
వచ్చే 2023 ఎన్నికల్లో పినపాకపై ములుగు ఎమ్మెల్యే సీతక్క పోటీ చేస్తుందా..? లేక సీతక్క కుమారుడు పోటీ చేస్తాడా? అనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సీతక్క నియోజకవర్గం వైపు డైరెక్ట్‌గా రాకుండా తన కుమారుడితో పినపాక సమస్యలను తెలుసుకుంటుందని మరికొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల సమయంలో తుఫాన్‌లాగా వచ్చి పినపాక గడ్డపైనే పోటీ చేస్తుందనే మాటలే జోరుగా వినిపిస్తున్నాయి. మరి 2023 ఎన్నికల్లో సీతక్క పినపాకపై కాంగ్రెస్ నుంచి పోటీచేస్తే విజయం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2023 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యేలను నమ్మే స్థితిలో లేరని కొందరు నాయకులు అనుకుంటున్నారు. అందుకే ఈసారి సీతక్కకు పినపాకను కట్టబెట్టాలని ప్రజలు చూస్తున్నట్లు టాక్. మరి 2023 ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో ఏం జరగబోతుందో ఆసక్తికరంగా వేచి చూడాల్సిందే.