యుద్ధ భయాల మధ్య నష్టాల్లో ముగిసిన సూచీలు!

Update: 2022-02-21 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఇంకా రష్యా-ఉక్రెయిన్ భయాలు కొనసాగుతున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో కొంతమేర కోలుకుంటున్న సంకేతాలు కనిపించినప్పటికీ మిడ్-సెషన్ తర్వాత సూచీలు నష్టాల్లోకి జారాయి. దేశీయంగా ప్రధాన సంఘటన లేమీ లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలే భారత స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి.

ఉదయం లాభాలతోనే ర్యాలీ కొనసాగించిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తగ్గకపోగా అక్కడి సరిహద్దుల్లో రష్యా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అమెరికా మార్కెట్లు సహా ఆసియా మార్కెట్లలోనూ ఈ అంశానికి సంబంధించే తీవ్రంగా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. మొదట అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య భేటీ ఉండనుందనే వార్తలతో లాభాల వైపు పయనించిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత సమావేశానికి రష్యా ప్రతికూల సంకేతాలు పంపించిన నేపథ్యంలో దేశీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగి చివరికి వరుసగా నాలుగో సెషన్‌లో నష్టాలు నమోదయ్యాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 149.38 పాయింట్లు కోల్పోయి 57,683 వద్ద, నిఫ్టీ 69.65 పాయింట్లు తగ్గి 17,206 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఫార్మా రంగాలు అధికంగా దెబ్బతిన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో విప్రో, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, సన్‌ఫార్మా, టీసీఎస్, ఐటీసీ, టెక్ మహీల్ద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.55 వద్ద ఉంది.

Tags:    

Similar News