స్టీఫెన్ హాకింగ్ వ‌ద్ద‌న్నా ఏలియ‌న్స్‌కు ఆ విష‌యం లీక్ చేస్తున్న‌ సైంటిస్ట్‌లు.. ఏం జ‌ర‌గ‌నుంది?!

అరెసిబో (Arecibo) మెసేజ్‌కు ఆప్‌డేట్ వెర్ష‌న్ అని చెప్పుకోవ‌చ్చు. Scientists beaming Earth’s location into space to contact aliens

Update: 2022-04-07 12:03 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఏలియ‌న్స్ ఉనికి గురించి ర‌క‌ర‌కాల వాద‌న‌లు రోజూ వ‌స్తూనే ఉంటాయి. అయితే, విశ్వం ఉంద‌ని, అందులో భూమిలా ఇత‌ర గ్ర‌హాలు కూడా ఉన్నాయ‌ని, భూమిపైన ఉన్న‌ట్లే ఏదో ఒక గ్ర‌హంలో ఇత‌రుల ఉనికి ఉండే ఉంటుంద‌న్న‌ది నిజ‌మే కావ‌చ్చు. అయితే, అలాంటి వారు ఎక్క‌డ ఉన్నారో ఇంత వ‌ర‌కూ మ‌నుషుల‌కు తెలియ‌దు. తెలిస్తే త‌ప్ప‌నిస‌రిగా వారితో సంప్ర‌దింపులు జ‌రుపుతారు. అంత‌టితో ఆగ‌క వ్యాపార కోరిక‌లు, అధికార‌కాంక్ష‌లు, ఇత‌రాత్రాల‌కు దారితీయ‌వ‌చ్చు. అందుకే గ్ర‌హాంత‌ర‌వాసుల్ని సంప్ర‌దించ‌డం గురించి స్టీఫెన్ హాకింగ్ హెచ్చ‌రించారు. అయినా, ఆ మాట‌ల‌ను పెడ‌చెవిన పెట్టిన శాస్త్ర‌వేత్త‌లు విశ్వంలో భూమి ఉన్న‌ స్థానాన్ని తెలుపుతూ అంతరిక్షంలోకి స‌మాచారం పంపుతున్నారు. అంటే, మనుషులు ఎక్క‌డ ఉన్నారో తెలుపుతూ ఏలియ‌న్స్‌కు సంకేతాలు పంపుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 'బీకాన్ ఇన్ ది గెలాక్సీ' అని పిలుస్తున్నారు. ఇది 1974లో ఏలియ‌న్ల కోసం పంపిన అరెసిబో (Arecibo) మెసేజ్‌కు ఆప్‌డేట్ వెర్ష‌న్ అని చెప్పుకోవ‌చ్చు. ఈ కొత్త సందేశం మన భూగ్రహం గురించిన వివరాలతో నిండి ఉంటుంది. అంటే మ‌న‌ పాలపుంతలో భూమి స్థానం ఎక్క‌డుందో, ఈ భూగ్ర‌హంపై ఎలాంటి జీవులున్నాయో తెలియ‌జేస్తూ మ‌నుషుల ఆకారాల‌ను కూడా పంపుతున్నారు.

అయితే, దీనిపై భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ముందుగానే హెచ్చరించారు. ఆయ‌న‌ మరణానికి ముందు, హాకింగ్ దీనికి సంబంధించి మాట్లాడుతూ.. 'మీరు చరిత్రను పరిశీలిస్తే.. మానవులకి, తక్కువ మేధో జీవులకు (ఏలియ‌న్ల‌) మధ్య సంబంధాలు వారి దృక్కోణం నుండి వినాశకరమైనవి. అలాగే, ఆధునిక, ఆదిమ టెక్నాల‌జీల‌తో నాగరికతల మధ్య సంప్ర‌దింపులు అంత మేలైన అభివృద్ధి సాధించలేదు' అన్నారు. అప్ప‌ట్లో 100 మిలియన్ డాల‌ర్ట‌ బ్రేక్‌త్రూ అయిన లిసన్ ప్రాజెక్ట్‌కు ప్రతిస్పందనగా 2015లో హాకింగ్ ఈ హెచ్చరికలు. ఈ ప్రాజెక్ట్‌లో అంతరిక్షంలో గ్రహాంతర జీవుల కోసం వెతకడం కూడా ఉంది.


నిజానికి, మనల్ని సందర్శించాలనుకునే గ్రహాంతరవాసుల కోసం గెలాక్సీలోకి మ‌నం పంపాల‌నుకుంటున్న‌ బీకాన్‌లో (మెసేజ్‌లో) సౌర‌కుటుంబంలో భూమి ఉన్న ప్రదేశం మాత్ర‌మే కాకుండా ఇందులో మన గ్రహం మ్యాప్, మానవుల రసాయన రూపం గురించి సమాచారం, అలాగే ఓ నగ్న పురుషుడు, నగ్న స్త్రీల రూపాలు కూడా ఉన్నాయి. గ్లోబులార్ క్లస్టర్‌లకు సంబంధించి పాలపుంతలో సౌర వ్యవస్థ టైమ్ స్టాంప్డ్ స్థానం వంటి డిజిటైజ్ స‌మాచారం ఉంది. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త జోనాథన్ జియాంగ్ ఈ ఆలోచనను వివరిస్తూ అతని సహచరులతో క‌లిసి ఈ అధ్యయనాన్ని ప్రీప్రింట్ సైట్ arXivలో ప్రచురించారు. ఈ సందేశం చైనా, కాలిఫోర్నియాలోని రేడియో టెలిస్కోప్‌ల రేడియో తరంగాల నుండి పంపబడుతుంది. పాలపుంతలోని గెలాక్సీ కేంద్రం నుండి 13,000 కాంతి సంవత్సరాల బిందువుకు ఈ సందేశాన్ని పంపాలని బృందం ఫిక్సింగ్ చేస్తోంది.

ఇక‌, గ్ర‌హాంతరవాసులను సంప్రదించాలా వద్దా అనే విషయంలో శాస్త్ర‌వేత్త‌ల వ‌ద్ద విభిన్న వాద‌న ఉంది. పరిణామంలో తగినంత దూరం చేరుకున్న‌త‌ర్వాత‌ ఏ గ్రహాంతరవాసులకైనా శాంతి ప్రాముఖ్యత తెలుస్తుంద‌ని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. అలాగే, ETI [ఎక్స్‌ట్రా-టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్] శాంతియుతంగా ఉంటుందా అనే సందేహానికి స‌మాధానంగా, 'ఏలియ‌న్లు గ‌నుక ఉండి, మానవ స్వభావం రిత్యా ETIతో యుద్ధం అనివార్యమైనా, బహుశా మరొక తెలివిగల జాతి అంతరించిపోవడానికి కారణం కూడా కావ‌చ్చు?' అని అంటున్నారు. అయితే, కాస్మోస్ ద్వారా క‌మ్యూనికేష‌న్ సాధించగ‌లిగిన స్థాయికి చేరుకున్న ఏ జాతి అయినా త‌మ‌లో తాము ఒక ఉన్న‌త స్థాయి స‌హ‌కారాన్ని క‌లిగే ఉంటార‌నీ, కాబ‌ట్టి శాంతి, స‌హకారం, దాని ప్రాముఖ్య‌త వారికి తెలిసే ఉంటుంద‌నే త‌ర్కాన్ని చెబుతున్నారు. ఏదైమైన‌ప్ప‌టికీ, దీనిపై బహిరంగ చర్చ అవసరమని జియాంగ్‌తో పాటు ఇత‌ర శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు.

Tags:    

Similar News