ఒక్క పోస్టర్‌తో మతపరమైన ఉద్రిక్తతలు..

దిశ, ఫీచర్స్ : అందరికీ ఒకే విధమైన పరిస్థితులుంటాయా? అందరూ ఒకే రకమైన వాతావరణంలో పెరగడం సాధ్యమవుతుందా? ప్రపంచాన్ని చూసే దృష్టికోణం ఒకరి నుంచి మరొకరికి మారుతుండదా..Latest Telugu News

Update: 2022-07-11 06:51 GMT

దిశ, ఫీచర్స్ : అందరికీ ఒకే విధమైన పరిస్థితులుంటాయా? అందరూ ఒకే రకమైన వాతావరణంలో పెరగడం సాధ్యమవుతుందా? ప్రపంచాన్ని చూసే దృష్టికోణం ఒకరి నుంచి మరొకరికి మారుతుండదా? దైవాన్ని కొలిచే విషయంలో ఒకే కులానికి చెందిన పేద, మధ్య తరగతి, ధనిక కుటుంబాల్లో బేధాలున్నప్పుడు.. ఒకే మతానికి చెందిన కోట్లాది మంది దేవుళ్లను పూజించే పద్ధతిలో మార్పు ఉండదా? నార్త్, సౌత్ అంటూ మనుషుల మధ్యనే తారతమ్యాలున్నప్పుడు.. దేవతను ప్రసన్నం చేసుకునే తీరులో ఉండకూడదని రూల్ ఉందా? ఒక చోట దుర్గామాతకు పాలు, పప్పులు, శాకాహారం సమర్పించుకుని నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తే.. మరో ప్రాంతంలో కల్లు శాకం, రక్తమాంసాలను నైవేద్యంగా ఇచ్చి పట్నాలు వేసుకుంటారు. ఇది తెలిసి కూడా కాంట్రవర్సీకి తెరతీస్తే.. సమాధానం చెప్పేదెవరు? ఒకవేళ తెలిసీ తెలియకనే నిరసనలకు దిగితే సముదాయించేదెవరు? అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. అవును.. మనం మాట్లాడబోయేది 'కాళీమాత' గెటప్‌లో ఉన్న ఓ మహిళ స్మోక్ చేస్తున్న 'కాళీ' మూవీ పోస్టర్ గురించే. కవర్ పేజీతోనే ఓ బుక్‌ను జడ్జ్ చేయడం సరికాదన్నట్లు.. ఒక్క పోస్టర్‌తోనే సినిమాను ఎందుకు జడ్జ్ చేయాలి? అందులో ఏం చెప్పబోతున్నారు? ఏ కోణంలో ఉండబోతోంది? సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది? అని తెలుసుకోకముందే నిరసనలు, ఆందోళనలు అంటూ రెచ్చిపోవడం ఎందుకు?

దేవుళ్లను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పూజించుకుంటారు. ఈ క్రమంలోనే నార్త్‌లో శాకాహారంగా ఉన్న దేవుళ్లే.. సౌత్ కొచ్చే సరికి మాంసాహారులుగా మారిపోతారు. పురాతన కాలంలో ఉన్న పరిస్థితులు ఇందుకు కారణం కాగా అవే సంప్రదాయాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. అంతెందుకు తెలంగాణ జానపద కళాకారులు సైతం.. దేవుళ్ల వేషధారణలో ఉండి సిగరెట్, మందు తాగుతూ చిల్ అయ్యే సీన్స్ చూస్తుంటాం కదా. ఈ క్రమంలోనే మహిళా ఫిల్మ్ మేకర్‌ 'లీనా మణిమేకలై' తన దృష్టికోణంలో కాళీమాత గురించి సినిమా తీయాలనుకుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కానీ అది కాస్తా కొందరి మనసులను గాయపరిచింది. మనోభావాలను దెబ్బతీసింది. అక్కడి వరకు ఓకే. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తే సరిపోయే దానికి అరెస్ట్‌లు, హత్యలు అంటూ రచ్చ చేశాయి కొన్ని హిందూ సంఘాలు. ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాయి నార్త్ పోలీస్ స్టేషన్లు. ఇంకొందరు మహానుభావులు ప్రైవేట్ పార్ట్స్‌లో హాట్ రాడ్స్ వేస్తామని ట్వీట్ల వర్షం కురిపించారు. మరి ఇంత దరిద్రపు భావజాలంతో ఉన్నవారికి ఏ విధంగా మనోభావాలు దెబ్బతిన్నాయో అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు.

అయినా సరే వినమ్రంగానే క్లారిటీ ఇచ్చింది లీనా మణిమేకలై. 'నా సినిమాలో చూపించే దేవత మానవత్వాన్ని చాంపియన్‌గా మారుస్తుంది. వైవిధ్యాన్ని ఆలింగనం చేసుకుంటుంది. శ్రామికులు, వీధి నివాసుల నుంచి సిగరెట్‌ను దయతో స్వీకరిస్తున్న దేవత ప్రేమను చూపించడమే పోస్టర్ వెనుకున్న అర్థం' అని క్లారిటీ ఇచ్చినా.. అల్లర్లు ఆగకపోగా హత్యాబెదిరింపులు మరింత ఎక్కువయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే మతాన్ని అవమానించిందని, IPC సెక్షన్ 295A, IT యాక్ట్ 2000లోని సెక్షన్ 79 మరియు మహిళా అసభ్య ప్రాతినిధ్య చట్టం, 1986 వంటి అభియోగాలు మోపింది మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పుకుంటున్న వర్గం.

దీంతో.. 'ఎఫ్‌ఐఆర్‌లను తీసుకురండి. లుక్ అవుట్ నోటీస్ ఎక్కడుంది? తల నరికేస్తారా? నరికేయండి. నాకు ఒక తల మాత్రమే ఉంది. నేను ఒక ఆర్టిస్ట్. క్రియేటివిటీ నా సొంతం. కరుణ నా భాష. ద్వేషానికి బానిసలయ్యే వారి కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉన్నాను' అని ట్వీట్ చేసింది. 'నా కాళీ విచిత్రమైనది. ఆమె స్వేచ్ఛా స్ఫూర్తి. పితృస్వామ్యంపై ఉమ్మివేస్తుంది. మతోన్మాదాన్ని కూల్చివేస్తుంది. పెట్టుబడిదారీ విధానాన్ని నాశనం చేస్తుంది. వెయ్యి చేతులతో అందరినీ ఆలింగనం చేసుకుంటుంది' అని సమాధానమిచ్చింది. 'నన్ను సెన్సార్ చేసే రైట్ ఎవరికీ లేదు' అని

ఇంతకీ లీనా మణిమేకలై ఎవరు?

తమిళనాడు మధురైలో జన్మించిన లీనా మణిమేకలై టొరంటో బేస్డ్ ఇండియన్ ఫిల్మ్ మేకర్, పోయెట్ అండ్ యాక్ట్రెస్. డాక్యుమెంటరీ, ఫిక్షన్, ఎక్స్‌పరిమెంటర్ పొయెటిక్ ఫిల్మ్స్‌తో సహా ఎన్నో ఆంథాలజీలు, చిత్రాలను తెరకెక్కించింది, లీనా మణిమేకలై ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మాతగా కూడా వ్యవహరించింది. గతంలో మాత్తమ్మ, పరాయి, బ్రేకింగ్ ది షాకిల్స్, లవ్ లాస్ట్, ఎ హోల్ ఇన్ ది బకెట్, గాడెసెస్‌తో సహా పలు డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించిన లీనా మణిమేకలై.. 2019లో 'మాడతి-యాన్ అన్‌ఫెయిర్ టెయిల్' ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల వ్యథలను తెరకెక్కించింది. అణగారిన వర్గానికి చెందిన ఓ యువతి దేవతగా అమరత్వాన్ని పొందిన కల్పిత కథలో నానా కష్టాలను కళ్లముందు సాక్షాత్కరింపజేసింది.

బాక్స్..

'నా సినిమాలో కాళీ నన్ను స్పిరిట్‌గా ఎంచుకుంది. ప్రైడ్ ఫ్లాగ్, కెమెరా తన చేతుల్లో పట్టుకుని ఫస్ట్ నేషన్స్.. ఆఫ్రికా, ఆసియా, పర్షియన్ సంతతికి చెందిన ప్రజలు, యూదులు, క్రైస్తవులు, ముస్లింలను కలుస్తుంది'- లీనా మణిమేకలై


Similar News