దరఖాస్తుల పరిశీలనలో ఆ జిల్లా టాప్.. వివాదాలకు అవకాశం లేకుండా పరిష్కారం
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక ధరఖాస్తులు వచ్చాయి. ఈ ధరఖాస్తులను అతి తక్కువ
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక ధరఖాస్తులు వచ్చాయి. ఈ ధరఖాస్తులను అతి తక్కువ సమయంలో భూ వివాధాలకు అవకాశం లేకుండా పరిష్కారం జరుగుతుంది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన ధరణికి వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో స్పష్టమైంది. జిల్లాలో ధరణిలో దరఖాస్తు పెట్టిన కొద్ది రోజుల్లోనే క్షేత్రస్థాయి నివేధికను బట్టి తిరస్కరించడమో, ఆమోధించడమో జరుగుతుంది. ఎక్కువ కాలం పెండింగ్ పెట్టి దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టడం రంగారెడ్డి జిల్లాలో కుదరదనే సాంకేతం జిల్లా కలెక్టర్ మండల తహసీల్దార్లకు ఇస్తున్నారు. రోజువారీ ప్రక్రియలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లో నివేదిక తెప్పించుకుంటున్నారు. అదే ఇతర జిల్లాలో దరఖాస్తు పెట్టి నెలలు గడిచిన ఎలాంటి ప్రయోజనం ఉండదు. జిల్లాలో వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 95 శాతానికిపైగా క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.
సమస్యల పరిష్కారంలో ముందడుగు..
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1,04,996 దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా వచ్చాయి. ఇందులో 1,02,633 దరఖాస్తులను అతి తక్కువ సమయంలోనే క్లియర్ చేశారు. ఈ దరఖాస్తుల్లో 80 శాతం వాటికి అనుమతులు రాగా వివిధ కారణాలతో 46 వేల 313 దరఖాస్తులను అధికారులు టెక్నికల్ సమస్యతో వాటిని తిరస్కరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 2363 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను బట్టి రంగారెడ్డి జిల్లాలో చేసుకున్న దరఖాస్తులు నిర్ణిత సమయంలో పూర్తి చేయబడుతున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఎప్పటికప్పుడు ధరణిలో వచ్చే దరఖాస్తులపై క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ పరమైన ప్రభుత్వ భూములను, కోట్ల విలువైన భూములను ఇటీవల కోర్టు కేసుల ద్వారా దక్కించుకోవడం జరిగింది.
మ్యుటేషన్ దరఖాస్తులే అత్యధికం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ చూపించిన 14 అంశాల్లో అత్యధికంగా మ్యుటేషన్, ల్యాండ్ మ్యాటర్ వంటి సమస్యలే వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆధార్ సీడింగ్, నాలా విత్ ఔట్ పీపీబీ, జీపీఏ, ప్రొహిబిటెడ్, కోర్టు కేసు పీపీబీ, ల్యాండ్ అకార్డ్, ల్యాండ్ మ్యాటర్, మ్యుటేషన్, ఎన్ఆర్ఐ, పీపీబీ, కోర్టు కేస్ ఇంటిమేషన్, సక్సెషన్, హౌస్ సైట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మ్యుటేషన్ కోసం 36,768 మంది దరఖాస్తు చేసుకుంటే 36,371 దరఖాస్తులు క్లియర్ చేశారు. ల్యాండ్ మ్యాటర్లో 28,764 దరఖాస్తులుంటే 28,454 క్లియర్ చేశారు. ఈ విధంగా కోర్టు కేసు, పీపీబీ, సక్సెషన్ వంటి అనేక దరఖాస్తులు నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది. ఒక వేళ తిరస్కరణకు గురైన వ్యక్తులు కలెక్టర్ కార్యాలయానికి వస్తే అక్కడ ఉండే సిబ్బంది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలను సూచిస్తున్నారు. దీంతో దరఖాస్తులు పొరపాటున వేరే దరఖాస్తుల్లో పెట్టిన తిరిగి పెట్టుకునే విధంగా సలహా సూచనలు చేస్తున్నారు.
లోపాలకు అవకాశం లేదు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ లోపాలకు అవకాశం ఉండదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. టెక్నికల్‌గా ఏదైనా జరిగితే తప్ప.. వ్యక్తిగతంగా ఎవరు కూడా ఏమీ చేయలేరని వివరిస్తున్నారు. మీ సేవ, ధరణి వెబ్సైట్లో దరఖాస్తుల్లో చేసుకున్న వాటిని పరిశీలించి అనుమతి ఇవ్వడం లేదా తిరస్కరించడం జరుగుతుంది. కానీ రికార్డుల్లో మార్పు చేసే అవకాశం క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎడిట్ చేసే అవకాశం లేదని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. దరఖాస్తులకు పెట్టిన అటాచ్ చేసిన పత్రాలు, స్థానిక రెవెన్యూ అధికారులు పంపిన నివేదికలను సరిపోల్చిన తర్వాతనే దరఖాస్తుకు మొక్షం కలుగుతుందన్నారు.