16 గంటల్లో 107 ఆపరేషన్లు.. భారతీయ వైద్యుడి రికార్డ్

Update: 2022-03-04 10:28 GMT

దిశ, ఫీచర్స్ : హ్యూమన్ బాడీలో ఏ పార్ట్‌కైనా సర్జరీ చేయడమంటే క్షణాల్లో ముగించే వ్యవహారం కాదు. ఇక అన్నిటికన్నా ప్రధాన అవయవంగా పరిగణించబడే కళ్లకు సర్జరీ అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాల్సిన పనిలేదు. అయితే, రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆప్తాల్మాలజీ డైరెక్టర్, ప్రయాగ్‌రాజ్‌లోని MLN మెడికల్ కాలేజ్(MLNMC) ప్రిన్సిపల్ Dr SP సింగ్.. 16 గంటల్లో వందకు పైగా ఆపరేషన్లతో రికార్డు సృష్టించారు. ఇంట్రాకోక్యులర్ లెన్స్(IOL) ఇంప్లాంట్‌తో ఫాకో ఎమల్సిఫికేషన్ విధానంలో 107 ఉచిత సర్జరీలు చేశారు.

ఫిబ్రవరి 25న ఉ 6.00 - రా. 10.30 గంటల మధ్య 16 గంటల 30 నిమిషాల పాటు నిరంతరాయంగా ఈ ఆపరేషన్లు జరిగాయి. వారం రోజుల పరిశీలన తర్వాత ప్రస్తుతం రోగులందరూ బాగానే ఉన్నారని ఎస్పీ సింగ్ వెల్లడించారు. ఇలా ఒకేసారి వందకు పైగా శస్త్రచికిత్సలు చేయడం సంతోషంగా ఉందన్న సింగ్.. ప్రజా సంక్షేమం కోసం పని చేసేందుకు మరింత మంది యువ సర్జన్స్‌‌కు ఈ ప్రయత్నం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ ఫీట్ గురించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు లేఖ రాశామని, ఇందుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ కూడా అందించామని తెలిపారు.

ఇదిలా ఉంటే, 2011లో న్యూ ఢిల్లీ, ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్‌కు చెందిన అప్పటి బ్రిగేడియర్ డాక్టర్ J.K.S పరిహార్.. తూర్పు లడఖ్‌లో 34 ఫాకోఎమల్సిఫికేషన్ ప్రొసీజర్స్ నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఇక 2016 మార్చిలో ఒకేరోజున 52 సర్జరీలు పూర్తిచేసిన ఎస్పీ సింగ్.. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించడం విశేషం.

Tags:    

Similar News