తెలంగాణలో తెరపైకి మావోయిస్టులు.. జనశక్తి నేత అరెస్ట్..!
దిశ, నిఘా ప్రతినిధి: తెలంగాణలో మావోయిస్టుల కదలికలు వేగవంతమయ్యాయనే వార్తలు వస్తున్న.. Latest Telugu News..
దిశ, నిఘా ప్రతినిధి: తెలంగాణలో మావోయిస్టుల కదలికలు వేగవంతమయ్యాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే అర్బన్ మావోల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి వార్తల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనశక్తి నేత ఆనంద్ అలియాస్ బొమ్మని నర్సింహాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారనే ప్రచారం మంగళవారం ఉదయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెనికి చెందిన బొమ్మని నరసింహ అలియాస్ ఆనంద్ జనశక్తి నేతగా కీలకంగా వ్యవహరించారు.
గతంలో మావో దళాల్లో చురుగ్గా పని చేశారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆయనను అరెస్టు చేశారని తెలుస్తోంది. అయితే ఆనంద్ అలియాస్ బొమ్మని నరసింహ అరెస్టుకు సంబంధించి స్థానిక పోలీసుల వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. ఇదిలావుంటే.. అనారోగ్యంతో ఉన్న జనశక్తి నేతను తక్షణమే కోర్టులో హాజరుపర్చాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అద్యక్షుడు జీవన్ కుమార్, పీడీఎస్‌యూ ఓయూ నాయకులు కోట ఆనంద్, అల్లూరి విజయ్ తదితరులు డిమాండ్ చేశారు. జనశక్తి నేత ఆనంద్ ఆరోగ్య పరిస్థితిని బహిర్గతం చేయాలని పేర్కొన్నారు.