కాంగ్రెస్ విధానం 'విభజించి దోచుకోవడం': ఉత్తరాఖండ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని
డెహ్రడూన్: కాంగ్రెస్ పార్టీది విభజించి దోచుకునే విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో సింకేనీ మైదాన్ లో విజయ్ సంకల్ప్ సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్లు ఎల్లప్పుడు మంచి పనులు చేసే పార్టీలకే మద్ధతుగా నిలుస్తారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో మొదటి దశ ఎన్నికల తర్వాత, బీజేపీ రికార్డు స్థాయిలో గెలుస్తుందని అర్థమైంది. మా కంటే ఎక్కువగా ప్రజలే బీజేపీని గెలిపించేందుకు ముందున్నారు. మంచి ఉద్దేశంతో పనిచేసేవారిని ఓటర్లు విడిచిపెట్టరు అని అన్నారు. గత ప్రభుత్వాలు సరిహద్దు ప్రాంతాల అభివృద్దిని మరిచాయని చెప్పారు. బీజేపీ మాత్రం పక్కా ప్రణాళికతో సరిహద్దు ప్రాంతాలకు ప్రాధాన్యత కల్పించిందని తెలిపారు. తాజాగా రూ.17వేల కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' తమ ప్రభుత్వ నినాదమని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నినాదం 'అందరినీ విభజించి, కలసి దోచుకోవడం' అని అన్నారు. కేంద్ర బడ్జెట్ పర్వతమాల పథకం పేరుతో కొండ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్తరాఖండ్ అభివృద్ది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు.