నల్లగొండ పార్లమెంట్ స్థానం రికార్డ్.. సభ్యత్వ నమోదులో దేశంలోనే టాప్

కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్ఠంగా చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంట్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని

Update: 2022-03-21 15:18 GMT

దిశ, తుంగతుర్తి: కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్ఠంగా చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంట్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న పేర్కొన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 542 పార్లమెంట్ స్థానాల్లో నల్గొండ పార్లమెంటుకు మొదటి స్థానం దక్కడం చరిత్రలోనే ఒక రికార్డుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశీలిస్తే సూర్యాపేట జిల్లా మొదటి స్థానంలో నిలవడం మరో రికార్డుగా ఆయన వర్ణించారు. సోమవారం తుంగతుర్తికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా 'దిశ'తో మాట్లాడారు.

సూర్యాపేట జిల్లాలో ఉన్న తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఊహించని స్థాయిలో డిజిటల్ సభ్యత నమోదు జరిగిందని వివరించారు. చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని తరహాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదు నిజమైన, నిఖార్సైన సభ్యత్వంగా పేర్కొన్నారు. గతంలో సభ్యత్వాలు ఉన్న పుస్తకాలను తీసుకొని ఏసీ గదుల్లో, తమ తమ ఇళ్లల్లో కూర్చొని ఇష్టానుసారంగా సభ్యత్వాల పూర్తి జరిగితే ప్రస్తుతం దీనికి పూర్తి విరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం డిజిటల్ సభ్యత్వ నమోదులో నాయకులే కార్యకర్తల ఇళ్లకు వెళ్లి సెల్ ఫోన్ ద్వారా ఫోటో తీయడం, దానికి వచ్చే ఓటీపీ తదితర వాటితో సభ్యత్వాన్ని పూర్తిచేయడంలాంటివి ప్రాముఖ్యత గల అంశాలుగా ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు స్వార్థం కోసం వెళ్ళి పోయినంత మాత్రాన కేడర్ వారితో వెళ్లలేదని, పటిష్టమైన కేడర్ తో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలంగా ఉందని స్పష్టం చేశారు. రాబోయే కాలం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని వివరించారు. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం కొనసాగుతోందని, పేదోడి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంటే నాయకులు మాత్రం తెలంగాణ సంపదను దోపిడీ చేస్తూ బలీయంగా ఎదిగారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని ప్రశ్నిస్తూ ఉద్యమించిన వారిని అనగ తొక్కుతున్నారని అన్నారు. ముఖ్యంగా నైజాం కాలంలో సైన్యం రిక్రూట్మెంట్ జరిగితే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం కేసీఆర్ తమ రక్షణ కోసం పోలీసు వ్యవస్థ రిక్రూట్ మెంట్ ను చేసుకున్నాడని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఎన్నికల్లో డబ్బుకు తోడు బంగారాన్ని ప్రజలకు పంచి పెట్టినా ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

Tags:    

Similar News