చిలీలో హ‌ఠాత్తుగా కుంగిన భూమి.. మిస్ట‌రీగా మారిన 'సింక్ హోల్‌'! (వీడియో)

దర్యాప్తులో ఏ వివ‌రాలు వెల్లడిస్తారో అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. Mysterious large sinkhole appears near Chilean mine.

Update: 2022-08-03 12:54 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః తాజాగా చిలీలోని మైనింగ్ ప్రాంతంలో సుమారు 25 మీటర్ల వ్యాసంతో ఒక భారీ సింక్‌హోల్ ఏర్ప‌డింది. సాధార‌ణంగా ఇలా భూమి కృంగి, రంధ్రం ఏర్ప‌డ‌టానికి ప‌లు కార‌ణాలుంటాయి గానీ, ఈ 'సింక్ హోల్' విష‌యంలో ఇంకా కార‌ణాలు తెలియ‌రాలేదు. మీడియా నివేదికల ప్రకారం, లుండిన్ మైనింగ్ అనే కెనడియన్ కంపెనీ, చిలీ రాజధాని శాంటియాగో సమీపంలో ఈ సైట్‌ను నియంత్రిస్తోంది. ఇక్క‌డ‌, వారాంతం త‌ర్వాత‌ కార్మికులు తిరిగి పనికి వచ్చి చూడ‌గా భారీ రంధ్రం కనిపించింది. హ‌తాశులైన కార్మికులు అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. ప్రస్తుతం, సైట్ జియాలజీ, మైనింగ్ జాతీయ సేవ – సెర్నాజియోమిన్‌తో పాటు ఇతర సంబంధిత అధికారులు విచారణ చేస్తున్నారు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం, "దాదాపు 200 మీటర్లు (656 అడుగులు) లోతుగా ఈ రంధ్రం ఏర్ప‌డింది" అని ఏజెన్సీ డైరెక్టర్ డేవిడ్ మోంటెనెగ్రో చెప్పారు. అయితే, "మేము అక్కడ ఎటువంటి పదార్థాన్ని గుర్తించలేదు. కానీ చాలా నీరు ఉన్న‌ట్లు మేము చూశాము" అని మీడియాతో అన్నారు. దీనిపై, తదుపరి విచారణ కోసం సైట్ మూసివేశారు. లుండిన్ మైనింగ్‌లో ఉన్న కార్మికులు ఎవరూ గాయపడలేదని, ఈ రంధ్రం వల్ల ప్రభావితం కాలేదని చెప్పారు. ఈ ప్ర‌దేశానికి "సమీపంలో ఉన్న ఇల్లు 600 మీ (1,969 అడుగులు) కంటే ఎక్కువ దూరంలో ఉందని, జనావాస ప్రాంతం లేదా పబ్లిక్ సర్వీస్ ప్రభావిత జోన్ నుండి దాదాపు కిలోమీటరు దూరంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది" అని కంపెనీ అధికారిక ప్రకటన తెలిపింది. అయితే, ఇప్ప‌టికీ, అధికారులు సింక్ హోల్ గురించి ఎటువంటి వివరణ ఇవ్వక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంతో పాటు ప‌లు ప్ర‌శ్న‌లు రేకెత్తిస్తోంది. దీనిపైన‌ స్థానిక సర్కిళ్ల‌లో అనేక సిద్ధాంతాలు, ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక‌, ఈ మిస్టీరియ‌స్ సింక్ హోల్‌ గురించి దర్యాప్తులో ఏ వివ‌రాలు వెల్లడిస్తారో అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.


Similar News