అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీతోనే సాధ్యం: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

Update: 2022-02-11 10:39 GMT

దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. టిఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్మాజీపేట వార్డులో మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్బాక పట్టణంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక నుంచి ముస్తాబాద్ వెళ్లే రహదారి కి 8 కోట్ల యాభై లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.

గతంలో తాను పార్లమెంట్ లో ఎనిమిది రోడ్లకు ప్రపోజల్ పెడితే రెండు రోడ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో దుబ్బాక-ముస్తాబాద్ రోడ్డు ఒకటి అని చెప్పారు. దీంతో పాటు దొంతి తూప్రాన్ రోడ్డు కు 22 కోట్లు మంజూరు అయినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే పది పైసల పని చేయకపోయినా శిలాఫలకలపై తమ పేరు కోసం తాపత్రయం పడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు మేము చేస్తే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తాను చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏ పని చేసినా తన పేరు శిలాఫలకంపై ఉండాలనే తాపత్రయం తో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన తీరు మార్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గన్నె వనిత, ఎంపిపి పుష్పలత, కౌన్సిలర్ ఆస. యాదగిరి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News