జీఓలపై అవగాహన సదస్సు.. ప్రజల సందేహాలను నివృత్తి చేసిన ఎమ్మెల్యే
దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని.. Latest Telugu News..
దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఇప్పటికే ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జీఓ నెంబర్ 58, 59ను మరోసారి అందుబాటులోకి తెచ్చిందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అన్నారు. జీఓ నెంబర్ 58, 59లపై చందానగర్ క్రిస్టల్ గార్డెన్‌లో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. పేద ప్రజల్లో వెలుగు నింపాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ 58, 59 జీఓల కింద ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగ పర్చుకోవలని కోరారు.
ఈ నెల 3 వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు125 గజాల వరకు ఉచితంగా క్రమబద్దీకరిస్తారని, ఆపై నిర్మాణాలు ఉన్న అనధికారిక నివాస రిజిస్ట్రేషన్ ధరల్లో 50 నుంచి వంద శాతం వరకు వసూలు చేస్తారని తెలిపారు. అదే విధంగా 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరల్లో 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని, 500 గజాల వరకు స్థలంలో నివాసం ఏర్పరచుకొని ఉంటే రిజిస్ట్రేషన్ ధరల్లో 75 శాతం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 500 గజాల పైన ఉన్న స్థలంలో నివాసం ఏర్పరచుకొని ఉంటే రిజిస్ట్రేషన్ ధరల్లో 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించాల్సి ఉంటుందని, వాణిజ్య అవసరాల కోసం వాడుకునే స్థలం పరిమాణంతో నిమ్మితం లేకుండా రిజిస్ట్రేషన్ ధర చెల్లించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రజలు లేవనెత్తిన సందేహాలకు రెవెన్యూ అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు శ్రీనయ్య, ఆయా డివిజన్ల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్డీఓ చంద్రకళ, శేరిలింగంపల్లి తహసీల్దార్ వంశీ మోహన్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, పూజిత, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి పాల్గొన్నారు.