బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారు.. ఎవరు ప్రశ్నించారంటే..?

Update: 2022-03-03 16:08 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు కిడ్నాప్ ల వ్యవహారంలో సీఎం కేసీఆర్, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై నోరుపారేసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం మహబూబ్ నగర్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి కానీ ఇలా హత్యలు చేసేలా కుట్రలు పన్నడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు.

తెలంగాణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. పాలమూరు జిల్లా సైతం ప్రశాంతంగా ఉండటమే కాకుండా అన్ని విధాలా అభివృద్ధి చెందుతోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక బీజేపీ నేతలు కుట్రపూరిత వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలకతీతంగా ఇటువంటి నేరపూరిత కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నానికి కుట్ర పన్నిన వారిలో ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్, మున్నూరు రవి ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని లక్ష్మారెడ్డి వెల్లడించారు.

దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నేతగా, ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కుట్రలు జరగడం దారుణమన్నారు. పోలీసులు త్వరగా స్పందించడం వల్లే మంత్రికి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. పూర్తిగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు జడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కూర మోని వెంకటయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్ మున్సిపల్ చైర్మన్ నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు హత్యా రాజకీయాలను నిరసిస్తూ, బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

Tags:    

Similar News