ఎనుమాములలో దేశీ మిర్చికి ఊహించని ధర.. బంగారంతో పోటీ పడి మరీ..
దిశ ప్రతినిధి, వరంగల్: దేశీ మిర్చి ధర ఊహించనంతగా దూసుకుపోతోంది. బంగారంతో పోటీ పడి..Mirchi Rates Creates Record In Enumamula Market in Warangal
దిశ ప్రతినిధి, వరంగల్: దేశీ మిర్చి ధర ఊహించనంతగా దూసుకుపోతోంది. బంగారంతో పోటీ పడి మార్కెట్లలో పరుగులు తీస్తోంది. బుధవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటా దేశీ మిర్చికి రూ.42000లు పలకడం గమనార్హం. మిర్చి అమ్మకాల్లో దేశ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్‌గా వ్యాపారులు పేర్కొంటున్నారు. గత పదిహేను రోజులుగా 35వేల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న దేశీ మిర్చి ప్రస్తుతం ఎనుమాముల మార్కెట్లో జెండా పాటగా రూ.42000వేలకు చేరుకుంది.
పత్తిది అదే దారి..
అంతర్జాతీయంగా కాటన్ ఉత్పత్తి పడిపోవడంతో దేశీయ మార్కెట్లలో కాటన్‌కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. సాధారణంగా మేలు రకం పత్తి క్వింటాకు రూ. 8వేలు వస్తే గొప్పగా ఉండేది. అలాంటిది ప్రస్తుతం రూ.10 వేలకు పైగా అమ్ముడవుతోంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ. 10,310లు పలకడం విశేషం. పత్తి, మిర్చి ధరలు దూసుకుపోతున్నందుకు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే అంతుచిక్కని వైరస్, వడగండ్ల వాన కారణంగా మిర్చి పంటలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. కొద్ది మంది రైతులకు మాత్రమే ఎకరానికి ఒకట్రెండు క్వింటాళ్ల మేర పంట చేతికి రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. పెరిగిన ధరతో కాసింత ఊరట చెందుతున్నారు. ఇక పత్తి రైతుల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడి అన్న విధంగా ఉంది. గుడ్డిలో మెల్ల అన్నవిధంగా ధర పెరగడం ఊరటనిస్తోందని చెబుతున్నారు.