కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ఉద్యోగాలు ఏవీ..? మంత్రి సత్యవతి రాథోడ్

దిశ, మహబూబాబాద్ టౌన్: కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడని- latest Telugu news

Update: 2022-03-16 14:04 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్: కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడని.. ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ ప్రైవేట్ పరం చేస్తూ.. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను దెబ్బ తీస్తుందన్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేస్తూ.. ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారని.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం మహబూబాబాద్‌లోని నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ పనుల పురోగతి, మెడికల్ కాలేజ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేయడం వల్ల రిజర్వేషన్లపై ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఆందోళనగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తండాలన్ని గ్రామ పంచాయతీలు అయ్యాయని.. ఈ తండాలన్నింటికి లింక్ రోడ్లు వేయడానికి ఈ బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారన్నారు. అదే విధంగా ఎస్టీల పంచాయతీ భవనాలకు ఒక్కొదానికి రూ.25లక్షలు కేటాయించినట్లు తెలిపారు.

ఈ ప్రాంతంలోని గిరిజనుల స్వయం ఉపాధి పథకాల కోసం రూ.232 కోట్ల ఇచ్చామన్నారు. అదే విధంగా గిరిజన ప్రాంతాల్లో 3 ఫేజ్ విద్యుదీకరణ కోసం గత బడ్జెట్ లో రూ.221కోట్లు పెడితే.. ఈ బడ్జెట్‌లో మరో రూ.100 కోట్ల పెట్టుకున్నామన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్లో మహిళా యూనివర్సిటీ కోసం రూ.100కోట్లు కేటాయించడం, 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థినుల కోసం హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వడం, తొమ్మిది జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న మహిళల ఆరోగ్య పెంపు కోసం న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం సీఎం కేసీఆర్ మహిళల పట్ల ఉన్న గౌరవానికి, ప్రేమకు నిదర్శనమన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ లోపు మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామన్నారు. దీంతో పాటు నర్సింగ్ కాలేజ్ ప్రారంభించడం, మెడికల్ కాలేజ్‌కు భూమి పూజ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News