హైకోర్టు తరలింపుపై ప్రతిపాదన పెండింగ్‌లో లేదు మంత్రి కిరణ్ రిజిజు
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు అంశంపై కేంద్రప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది.
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు అంశంపై కేంద్రప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతి నుంచి హైకోర్టును మార్చే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్‌లో లేదని కేంద్రం తేల్చి చెప్పింది. రాజ్యసభలో హైకోర్టు తరలింపు అంశంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. '2019 జనవరిలో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ని విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశారు. 2020 ఫిబ్రవరిలో కర్నూలుకు మార్చాలని సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించారు. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ బదిలీ సంబంధిత హైకోర్టుతో సంప్రదిస్తుంది.
హైకోర్టుతో సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. హైకోర్టు నిర్వహణ ఖర్చు భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది' అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఇకపోతే మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినా త్వరలో మరోసారి బిల్లు ప్రవేశపెడతామని ఇటీవలే సీఎం వైఎస్ జగన్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించి కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తానని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. ఇందుకు సంబంధించి హైకోర్టుతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కేంద్రం సూచించింది. ఇందుకు సంబంధించిన ఖర్చు అంతా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రతిపాదనలేదని.. హైకోర్టు, రాష్ట్రప్రభుత్వం కలిసి పూర్తిస్థాయి ప్రతిపాదనను అందజేయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సూచించారు.